బెంగళూరు విషాదం నుంచి చాలా నేర్చుకున్నాం
బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఉదంతం.. ఇప్పటికీ వెంటాడుతూనే వస్తోంది. ఈ ఘటనకు కారణమైన చిన్నస్వామి స్టేడియాన్ని దాదాపుగా మూసివేశారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించనున్న మహారాజా ట్రోఫీ మ్యాచ్ లన్నింటినీ మరో చోటికి షిఫ్ట్ చేయాల్సొచ్చింది.
ఈ ఏడాది జూన్ 4వ తేదీన చిన్నస్వామి స్టేడియం వెలుపల సంభవించిన ఈ తొక్కిసలాటలో 11 మంది అభిమానులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. పలువురు అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. విజయోత్సవ ర్యాలీల కోసం సరికొత్త మార్గదర్శకాలను రూపొందించడానికి కారణమైంది.

ఈ ఘటనపై తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ యాజమాన్యం స్పందించింది. తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో ఓ ప్రకటన పోస్ట్ చేసింది. అభిమానుల యోగక్షేమాలు, సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా 'ఆర్సీబీ కేర్'ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
తొక్కిసలాట చోటు చేసుకున్న రోజు తమ గుండె పగిలిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ బాధను మూడు నెలలుగా మౌనంగా అనుభవించామని, దీని నుంచి కోలుకోవడానికి ఇన్ని రోజులు పట్టిందని రాయల్ ఛాలెంజర్స్ తెలిపింది. ఈ విషాదకర ఘటన నుంచి తాము చాలా నేర్చుకున్నామని, అభిమానులకు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేసింది.
అందుకోసమే అభిమానుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఆర్సీబీ కేర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ఈ కేర్ సెంటర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే పంచుకుంటామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ యాజమాన్యం వివరించింది.
ఈ దుర్ఘటన అటు రాజకీయంగా కూడా కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు అప్పట్లో డిమాండ్ చేశారు. దీన్ని ఆయన ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వచ్చారు.
తొక్కిసలాట సంభవించిన ఉత్తరప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంతమంది ముఖ్యమంత్రులు రాజీనామాలు చేశారంటూ ఎదురుదాడికి దిగిన సందర్భాలు ఉన్నాయి. ఉచిత ప్రవేశం ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు అధిక సంఖ్యలో రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై విచారణ నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది అప్పట్లో.












Click it and Unblock the Notifications