ఈ తలతిక్క ప్లాన్ నీదే కదా..!!
IND vs ENG 4th test: ఇంగ్లాండ్ తో జరుగుతున్న అండర్సన్- టెండుల్కర్ టెస్ట్ సిరీస్ లో భారత్ వెనుకంజలో ఉంది. నాలుగో టెస్ట్ మ్యాచ్ లోనూ తడబడుతోంది. రెండో ఇన్నింగ్ లో ఒక పరుగుకు రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత శుభ్ మన్ గిల్, కేెఎల్ రాహుల్ స్ఫూర్తిదాయక ఆటతీరును ప్రదర్శించారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.
నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి భారత్.. 174 పరుగులు చేసింది. గిల్, కేఎల్ రాహుల్ క్రీజ్ లో ఉన్నారు. రెండో ఇన్నింగ్ లో ఇంకా 137 పరుగులు వెనుకంజలో ఉంది జట్టు. నేడు చివరి రోజు కావడం, ఇంకా టీమిండియా చేతిలో ఎనిమిది వికెట్లు ఉండటం వల్ల ఈ మ్యాచ్ డ్రా అవుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.

ఇంగ్లాండ్ బౌలర్లు చెలరేగితే మాత్రం ఫలితం ఆ జట్టు వైపు మొగ్గు చూపుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఇప్పటికే సిరీస్ పై ఇప్పటికే పట్టు సాధించింది ఇంగ్లాండ్. అయిదు టెస్ట్ మ్యాచ్ ల ఈ సిరీస్ లో 2-1 తేడాతో ఆధిక్యతలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ గనక గెలిస్తే సిరీస్ ఆ జట్టు ఖాతాలోకి వెళ్తుంది.
అదే జరిగితే- హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో ఇది వరుసగా మూడో టెస్ట్ సిరీస్ ఓటమి అవుతుంది టీమిండియాకు. దీనికి ముందు న్యూజిలాండ్‌తో 0-3, ఆస్ట్రేలియాతో 1-3 తేడాతో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ రెండు ఓటముల వల్ల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ నుంచి తప్పుకోవాల్సొచ్చింది.
ఈ టెస్ట్ సిరీస్‌లో జట్టు ఎంపిక విషయంలో గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేకించి- టీమిండియా మాజీ బ్యాటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ విమర్శలు గుప్పించారు. నలుగురు సీమర్లను తీసుకోవాలనే గంభీర్ ఆలోచనను తప్పుపట్టారు. ఆ గేమ్ ప్లాన్ సరైంది కాదని అభిప్రాయపడ్డారు.
ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోతో మంజ్రేకర్ మాట్లాడారు. ఆల్‌రౌండర్లను గంభీర్ ఎంపిక చేయడంపై విమర్శలు గుప్పించారు. టెస్ట్ స్పెషలిస్ట్ ప్లేయర్లకు బదులుగా ఆల్‌రౌండర్ల వైపు మొగ్గు చూపడం సరికాదని అన్నారు. నలుగురు సీమర్లను ఆడించాలనే ఆలోచన కూడా అర్థం లేనిదని ఆయన అన్నారు. సీమర్లు ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయట్లేదని గుర్తు చేశారు.
స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్‌ను ఎందుకు ఆడించ లేదని కూడా మంజ్రేకర్ ప్రశ్నించారు. ప్రతి ఇన్నింగ్స్‌లో 20 వికెట్లు తీయాలని పదే పదే చెబుతున్నప్పటికీ- ఆ సత్తా ఉన్న కుల్ దీప్ ను ఎందుకు తుదిజట్టుకు ఎంపిక చేయలేదో అర్థం కావట్లేదని మంజ్రేకర్ వ్యాఖ్యానించారు. వాషింగ్టన్ సుందర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కుల్ దీప్ కు ఆడే అవకాశం రాలేదని పేర్కొన్నారు.
తొలి టెస్టు మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ సామర్థ్యాన్ని చూసినప్పటికీ.. మళ్లీ అతన్ని ఎంపిక చేయడం సరికాదని మంజ్రేకర్ చెప్పారు. బ్యాటింగ్, బౌలింగ్ చేయగల ఆటగాడిని తీసుకోవాలనే ఆలోచనను గంభీర్ విడనాడాలని స్పష్టం చేశారు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఒక మంచి బ్యాటర్ జట్టుకు అవసరం అని అభిప్రాయపడ్డారు.
జట్టు ఎంపిక సరిగా లేకపోవడం వల్లే ఈ టెస్ట్ సిరీస్ లో భారత్ వెనుకంజలో ఉందని తేల్చి చెప్పారు మంజ్రేకర్. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించినా, జట్టులో ఒక మంచి బ్యాటర్ ఉంటే బాగుండేదని, అలాగే వికెట్లు తీసే బౌలర్ కూడా అవసరమని అన్నారు.
ఆల్ రౌండర్ల కంటే.. బ్యాటింగ్, బౌలింగ్ స్పెషలిస్టులను తీసుకోవడం టెస్ట్ క్రికెట్ కు మంచిదని, ఆ దిశగా గంభీర్ ఎందుకు ప్లాన్ చేయలేకపోతున్నాడని మంజ్రేకర్ ప్రశ్నించారు. మొత్తం సిరీస్‌లో కుల్ దీప్ యాదవ్‌ను ఆడించకపోవడం జట్టు మేనేజ్మెంట్ వ్యూహాత్మక తప్పిదని అన్నారు.












Click it and Unblock the Notifications