టీమిండియాలో కొత్త ముఖం అరంగేట్రం- జడేజా చేతుల మీదుగా
మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేసిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌కు ఎట్టకేలకు టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. నేటి నుంచి కొలంబో వేదికగా శ్రీలంకతో ఆరంభమైన రెండో టెస్ట్ మ్యాచ్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. కుల్ దీప్ యాదవ్ స్థానంలో అతన్ని ప్లేయింగ్ 11లోకి తీసుకుంది టీమ్ మేనేజ్మెంట్. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు సారాంశ్.
గాయం వల్ల జట్టుకు అందుబాటులో లేని వాషింగ్టన్ సుందర్ స్థానంలో సారాంశ్.. ఈ సిరీస్ కు ఎంపికయ్యాడు. మొదటి టెస్ట్ లో ఆడే అవకాశం లభించలేదు. ఇప్పుడు పిలుపు అందుకున్నాడు. ప్రస్తుత కాలంలో చాలామంది ఆటగాళ్లు ఐపీఎల్ ద్వారా జాతీయ జట్టుకు ఎంపికవుతున్న విషయం తెలిసిందే. బుమ్రా మొదలుకుని తిలక్ వర్మ దాకా చాలామంది క్రికెటర్లు ఐపీఎల్ ద్వారానే టీమిండియాకు సెలెక్ట్ అయ్యారు. సారాంశ్ మాత్రం దీనికి భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.

రంజీ, దులీప్, ఇరానీ.. వంటి దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో నిలకడగా రాణించడం ద్వారా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. రెడ్ బాల్ క్రికెట్లో అతడు చూపిన ప్రతిభే ఇప్పుడతనికి భారత్ తరఫున ఆడే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ఎడంచేతి వాటం బ్యాటింగ్, కుడిచేతి వాటం ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసే ఈ 33 ఏళ్ల ఆటగాడి ఫస్ట్ క్లాస్ కెరీర్ అద్భుతంగా సాగింది. ఇప్పటివరకు ఆడిన 54 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 27.30 సగటుతో 188 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో రెండు సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలతో 2,223 పరుగులు చేశాడు.
ఇటీవల ఇండియా-ఎ తరఫున శ్రీలంకలో జరిగిన అనధికారిక టెస్టులో ఆరు వికెట్లు పడగొట్టడంతో పాటు 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. శ్రీలంక పర్యటనలో టీమిండియా 0-1 తేడాతో ఆధిక్యతను సాధించింది. గాలేలో జరిగిన మొదటి టెస్ట్ లో ఘన విజయం సాధించింది. ఇప్పుడు రెండో టెస్ట్ గెలుపుపై కన్నేసింది. క్లీన్ స్వీప్ కోసం పట్టుదలతో ఉంది.
రెండో టెస్టు కోసం ప్రకటించిన భారత తుది జట్టులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, వికెట్ కీపర్ రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలతో పాటు ఇప్పుడు సారాంశ్ జైన్ కూడా భాగమయ్యాడు. ఎంతో కాలంగా కలలుగన్న జాతీయ జెర్సీని ధరించిన సారాంశ్ తన స్పిన్ మాయాజాలంతో టీమిండియా విజయాల్లో ఎంతవరకు కీలక పాత్ర పోషిస్తాడో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications