ఇది కేవలం ఆట కాదు.. క్రికెట్ మాస్టర్ క్లాస్: మైక్రోసాఫ్ట్ సీఈవో
Microsoft CEO: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల క్రికెట్‌పై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఇటీవల ముగిసిన ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌ను ఆయన ప్రశంసించారు. ఇది కేవలం ఒక ఆట కాదని.. ఇది స్థిరత్వం, వ్యూహం, క్రీడా స్ఫూర్తికి ఒక మాస్టర్ క్లాస్ అని ఆయన అభివర్ణించారు. 5 మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్ 2-2తో సమంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇరు జట్లు చూపిన అద్భుత ప్రదర్శనలకు క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఈ క్రమంలో ఈ టెస్ట్ సిరీస్ గురించి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు.
"25 రోజులు. 5 మ్యాచ్‌లు. స్కోరు 2-2తో సమమైంది. ఇది కేవలం ఆట కాదు - ఇది టెస్ట్ క్రికెట్ శాశ్వతమైన ఘనత. ఇది ఒక అద్భుతమైన సిరీస్. ఈ సిరీస్ నాటకీయత, ధైర్యంతో కూడిన పోరాటం. అద్భుతమైన ఆటను పంచినందుకు భారత్, ఇంగ్లాండ్ జట్లకు నా అభినందనలు." అని నాదెళ్ల రాశారు. ఈ పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందనను పొందింది. ఈ పోస్ట్‌కు మూడు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

🏏 25 days. 5 battles. Scores tied 2-2.
— Satya Nadella (@satyanadella) August 5, 2025
This isn’t just a game — it’s Test Cricket in all its timeless glory.
A series for the ages. Hats off to IND & ENG for the drama, grit, and greatness.
ఆనంద్ మహీంద్రా స్పందన
సత్య నాదెళ్లతో పాటు మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఈ సిరీస్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. మహీంద్రా కూడా ఎక్స్ లో ఒక పోస్ట్ చేస్తూ, "స్కోర్ బోర్డ్ 2-2 అని, సిరీస్ డ్రా అని చూపిస్తోంది. కానీ క్రీడా స్ఫూర్తి ప్రకారం ఈ సిరీస్ భారత్ గెలిచింది. ఎందుకంటే, ఓటమి అంచున ఉన్నప్పుడు కూడా తిరిగి వచ్చి పోరాడే స్ఫూర్తిని స్కోర్‌బోర్డ్ పూర్తిగా వివరించలేదు" అని పేర్కొన్నారు. మహీంద్రా తన పోస్ట్‌లో అమెరికన్ ఫుట్‌బాల్ కోచ్ విన్స్ లోంబార్డి మాటలను గుర్తు చేసుకున్నారు. "మీరు పడిపోయారా లేదా అనేది ముఖ్యం కాదు, మీరు తిరిగి లేచారా లేదా అనేది ముఖ్యం." అని పేర్కొన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ విజయంపై కూడా సత్య నాదెళ్ల ప్రశంసలు
క్రికెట్‌కు సంబంధించిన పోస్ట్‌లు చేయడం సత్య నాదెళ్లకు ఇదే మొదటిసారి కాదు. ఈ సంవత్సరం మార్చిలో, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన భారత జట్టును కూడా ఆయన అభినందించారు. "న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత జట్టు అద్భుతమైన విజయానికి అభినందనలు!" అని సత్య నాదెళ్ల రాసుకొచ్చారు. అప్పుడు కూడా, ఆయన జట్టును గెలిపించినందుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లపై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. "రోహిత్, కోహ్లీల అద్భుతమైన ప్రదర్శనలకు ప్రత్యేక ప్రశంసలు. లెజెండ్స్! 🙌" అని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications