యుద్ధం కంటే తక్కువేం కాదు: పాక్ ను ఇరగదీయండి
ఆసియా కప్ 2025లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య నేడు మ్యాచ్ జరుగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. యార్క్ రైవల్స్ మధ్య జరిగే హైఓల్టేజ్ గేమ్ ఇది. ఇంటర్నేషనల్ టోర్నమెంట్లల్లో పాకిస్తాన్ చేతిలో ఓటమి ఎరుగని చరిత్ర ఉంది టీమిండియాకు. పాకిస్తాన్ ఇప్పుడున్న ఫామ్ ను బట్టి చూస్తోంటే- భారత్ దీన్ని నిలబెట్టుకుంటుందనే అంచనాలు ఉన్నాయి.
ఈ టోర్నమెంట్ లో పాకిస్తాన్ బోణీ కొట్టింది. ఒమన్ పై దుమ్ము రేపింది. బ్యాటింగ్ లో విఫలమైనప్పటికీ.. బౌలింగ్ లో మాత్రం చెలరేగింది. 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఒమన్ ను జస్ట్.. 67 పరుగులకే కుప్పకూల్చింది. బౌలింగ్ పదును తగ్గలేదని నిరూపించుకుంది పాకిస్తాన్. ఆరుమంది బౌలింగ్ చేస్తే.. వాళ్లందరికీ వికెట్లు దక్కాయి. ఒక్కరు కూడా ఖాళీ చేతులతో మ్యాచ్ ను ముగించలేదు.

ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించాలని కోరుతూ అభిమానులు పెద్ద ఎత్తున పూజలు పునస్కారాలకు దిగారు. వారణాసిలోని రాజేంద్ర ప్రసాద్ ఘాట్ వద్ద ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగా నదిలో పుణ్యస్నానాలను ఆచరించారు. కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కేప్టెన్ శుభ్ మన్ గిల్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, జస్ ప్రీత్ బుమ్రా, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివం దుబే, రింకూ సింగ్ వంటి ప్లేయర్ల ఫ్లెక్సీలను ప్రదర్శించారు.
వారణాసి గంగానదీ తీరం మొత్తం దేశభక్తి, ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. హర హర మహాదేవ్, భారత్ మాతా కీ జై అనే నినాదాలు ఘాట్ల వద్ద మారుమోగాయి. గంగా హారతి ఇచ్చి, నదిలో నిలబడి ప్రార్థనలు చేశారు అభిమానులు. జాతీయ జెండాలను ప్రదర్శించారు. కొందరు హనుమంతుడి ఫ్లెక్సీలను పట్టుకుని జట్టుకు బలం, ధైర్యం కలగాలని, పూజించారు. జట్టుకు శుభం చేకూర్చాలని ఆకాంక్షించారు.
భారత్ ఎప్పుడూ పాకిస్తాన్ పై ఓడిపోలేదని ఫ్యాన్స్ గుర్తు చేశారు. యుద్ధభూమిలోనైనా, ఆర్థిక రంగంలోనైనా, క్రీడలలోనైనా పాకిస్తాన్ ను ప్రతీసారీ ఓడించిందని పేర్కొన్నారు. నేటి మ్యాచ్ యుద్ధం కన్నా తక్కువేమీ కాదని అభివర్ణించారు. భారత్ ఇప్పుడు కూడా ఘన విజయం సాధిస్తుందని బలంగా నమ్ముతున్నామని అన్నారు. ఈ పూజలు ఒక్క వారణాసికే పరిమితం కాలేదు. దేశం నలుమూలలా ప్రజలు టీమిండియా ప్రదర్శనపై ఆశలు, నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఢిల్లీ, ముంబై, కోల్ కత, బెంగళూరు, బెళగావి, చెన్నై.. వంటి పలు నగరాల్లో పూజలు జరిగాయి. సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన కేప్టెన్ అని, అతని సారథ్యంలో టీ20 ఫార్మట్లల్లో భారత్ ఓడిన మ్యాచ్ చాలా తక్కువ అని ఓ అభిమాని చెప్పాడు. 90 శాతానికి పైగా సక్సెస్ రేట్ ఉందని అన్నాడు. పాకిస్తాన్‌ను ఓడించడం ఎప్పుడూ ప్రత్యేకమే అని, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని మరో అభిమాని చెప్పుకొచ్చాడు.












Click it and Unblock the Notifications