ఈడీ వలలో టీమిండియా మాజీ స్టార్ ప్లేయర్
టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కొరడా ఝుళిపించింది. ఆయనను విచారణకు పిలిపించింది. ఈ ఆదేశాల మేరకు కొద్దిసేపటి కిందటే లెజెండరీ బ్యాటర్.. దేశ రాజధానిలో ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్టేట్ మెంట్ ను ఈడీ అధికారులు నమోదు చేయనున్నారు.
గతంలో 1xBet అనే బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారు సురేష్ రైనా. దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. పలు అడ్వర్టయిజ్మెంట్లల్లో నటించారు. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్ ల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న విషయం తెలిసిందే. వీటిపై విచారణకూ ఆదేశించింది.

ఈ నేపథ్యంలో- 1xBet బెట్టింగ్ యాప్ యాడ్స్ లల్లో నటించినందుకు ఈడీ ఆయనకు ఇదివరకే సమన్లు జారీ చేసింది. విచారణకు పిలిపించింది. ఈ నేపథ్యంలో ఆయన కొద్దిసేపటి కిందటే విచారణకు హాజరయ్యారు. ఈ యాప్ యాడ్స్, ఇతర ప్రమోషన్ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు ఎంత రెమ్యునరేషనన్ తీసుకున్నారు? ఆయన చెల్లించిన మొత్తం ఏ రూపంలో అందింది? అనే విషయాలపై ఈడీ ఆరా తీయనుంది.
అంత భారీ మొత్తాన్ని సురేష్ రైనాకు చెల్లించేంత ఆదాయం 1xBet యాప్ యాజమాన్యానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులో మనీలాండరింగ్ వంటి చట్ట వ్యతిరేక లావాదేవీలు ఏవైనా చోటు చేసుకున్నాయా? తాను తీసుకున్న రెమ్యునరేషన్ కు సురేష్ రైనా ట్యాక్స్ చెల్లిండా? లేదా, బ్యాంక్ స్టేట్ మెంట్లు.. ఇవన్నీ కూడా విచారణ సందర్భంగా వెలికి తీయనున్నారు ఈడీ అధికారులు.
టీమిండియాలో బెస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లలో ఒకడిగా సురేష్ రైనాకు పేరుంది. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లలో సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా ఆయన రికార్డు సృష్టించారు. 322 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 7,988 పరుగులు సాధించారు. బ్యాటింగ్ సగటు 32.87 కాగా, స్ట్రైక్ రేట్ 92కు పైమాటే.
291 ఇన్నింగ్స్‌లలో ఏడు సెంచరీలు, 48 అర్ధ సెంచరీలు సాధించారు. అతని అత్యధిక స్కోరు 120. 2011 ఐసీసీ వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులో సభ్యుడు కూడా. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్ కు ప్రాతినిథ్యాన్ని వహించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన అయిదో ఆటగాడిగా రైనా నిలిచాడు.












Click it and Unblock the Notifications