సఫారీలతో సమరం వేళ ప్లాన్ మార్చిన సూర్య, అభిషేక్ స్థానం ఇక...!!
IND vs SA : టీమిండియా కీలక సమరానికి సిద్ధం కాబోతోంది. టీ20 వరల్డ్‌కప్ గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన సూర్యకుమార్ సేన ఇప్పుడు సెమీస్ బెర్త్‌పై కన్నేసింది. ఇందులో భాగంగా సూపర్-8 గ్రూప్ 1లో నేడు (ఆదివారం) తమ తొలి మ్యాచ్‌ను దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఇక, ఈ రోజు నుంచి ఆడుతున్న సూపర్ -8 దశలో ప్రతీ మ్యాచ్ కీలకమే కాకుండా.. ప్రత్యర్థి దక్షిణాఫ్రికా కావడంతో భారత్ అన్ని విభాగాల్లోనూ చెలరేగాల్సిందే. ఇందు కోసం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొత్త ప్లాన్ సిద్దం చేసారు. అభిషేక్ స్థానంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు.
సూపర్ -8 లో టీమిండియా బలమైన సౌతాఫ్రికాతో తల పడుతోంది. టీమిండియా బలంగా కనిపిస్తున్నా.. ప్రత్యర్థి అంతే బలంతో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. అటు సఫారీలు క్రితం టోర్నీ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉన్నారు. డికాక్, మార్‌క్రమ్, బ్రెవిస్, స్టబ్స్, రికెల్టన్, మిల్లర్‌లతో వీరి బ్యాటింగ్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. అటు బౌలింగ్‌లోనూ పేసర్లు యాన్సెన్, రబాడ, ఎన్‌గిడి, స్పిన్నర్ కేశవ్‌లతో అన్ని రంగాల్లోనూ బలంగా ఉంది. కాగా, అనూహ్య రీతిలో డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ మూడు డకౌట్లతో ఇంకా పరుగుల ఖాతానే తెరువలేదు. అయితే తన గైర్హాజరీలో ఓపెనర్‌గా శాంసన్ నమీబియాపై 8 బంతుల్లోనే 22 పరుగులతో చెలరేగాడు. దీంతో నేటి మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఎవరిని ఆడిస్తారనే సందేహాలు నెలకొన్నాయి. కానీ కెప్టెన్ సూర్య మాత్రం అభిషేక్‌పై పూర్తి నమ్మకాన్ని ఉంచాడు. అతడి ఫామ్ గురించి ఆందోళన పడుతున్న వారి గురించే తాను ఆందోళన పడుతున్నట్టు తేల్చాడు. అభిషేక్ టచ్‌లోకి వచ్చేందుకు ఒక్క ఇన్నింగ్స్ చాలనే అభిప్రాయంతో టీమ్ ఉండడంతో ఇషాన్‌తో కలిసి తనే బరిలోకి దిగే చాన్సుంది.

బలమైన సఫారీల పైన కొత్త గేమ్ ప్లాన్
అభిషేక్ త్వరగా అవుట్ అవుతుండటం వన్‌డౌన్‌లో తిలక్ వర్మ బ్యాటింగ్‌పై ప్రభావం పడుతోంది. వికెట్ కాపాడుకునేందుకు అతను భారీ షాట్లకు వెళ్లడం లేదు. దీంతో మధ్య ఓవర్లలో స్కోరు నెమ్మదిస్తోంది. అయితే తమ సూచన మేరకే తిలక్ అలా ఆడాల్సి వస్తోందని కెప్టెన్ చెబుతున్నాడు. మిడిలార్డర్‌లో సూర్య పాక్, నెదర్లాండ్స్‌పై రాణించలేకపోయాడు. కాగా.. హార్దిక్, దూబే చివర్లో చెలరేగుతుండడం సానుకూలాంశం కానుంది. సఫారీల బౌలింగ్ లైనప్ పటిష్టంగా ఉండడంతో భారత బ్యాటర్లు సమష్ఠిగా రాణించాల్సి ఉంది. పేసర్ బుమ్రా, స్పిన్నర్ వరుణ్‌ల బంతులను గ్రూప్ దశలో ప్రత్యర్థి జట్లు ఆడలేకపోయాయి. కానీ సౌతాఫ్రికా బ్యాటింగ్ లైన్‌పను ఈ ద్వయం ఎలా అడ్డుకుంటుందనేది వేచిచూడాల్సిందే. పిచ్‌ను బట్టి కుల్దీప్ కంటే అర్షదీప్ కే చాన్స్ ఇవ్వవచ్చు. అలాగే సుందర్ స్థానంలో అక్షర్ తిరిగి బరిలోకి దిగనున్నాడు. పిచ్ కండీషన్ల కు అనుగుణంగా తుది జట్టు ఖరారు చేయనున్నారు. అయితే, అహ్మదాబాద్ కలిసి వచ్చే పిచ్ గా భావిస్తుండటంతో.. ఈ మ్యాచ్ లో టీమిండియా పైన అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications