Suryakumar Yadav: టీమిండియా కొలీగ్ కి సారీ చెప్పిన సూర్యకుమార్ యాదవ్...!
టీ20 వరల్డ్ కప్ (T20 World cup 2026)ముగిసింది. సొంతగడ్డపై జరిగిన ఐసీసీ మెగా టోర్నీ టైటిల్ ను భారత్ సగర్వంగా అందుకుంది. టోర్నీ ఆద్యంతం అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా.. టైటిల్ విజయానికి అన్ని అర్హతలు ఉన్నాయని చాటిచెప్పింది. ఇదేదో గాలివాటంగా వచ్చిన ట్రోఫీ కాదని, ఇందుకు తమకు అన్ని అర్హతలు ఉన్నాయని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ వచ్చింది. చివరికి అదే నిజమైంది. అయితే ఈ క్రమంలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (suryakumar Yadav) ఓ పొరబాటు చేశాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రపంచ కప్ సూపర్ 8 మ్యాచ్ లో భారత్ చేసిన ఓ తప్పిదం ఈ మ్యాచ్ లో ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. అది ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌ను ఈ మ్యాచ్ కు తీసుకోకపోవడం. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. అది తన తప్పేనని సూర్య నిజాయితీగా అంగీకరించాడు. అక్షర్ పటేల్ ఈ నిర్ణయంతో చాలా కలత చెందాడని, మ్యాచ్ తర్వాత తాను ఆల్ రౌండర్‌కు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పానని సూర్యకుమార్ వెల్లడించాడు.

ఈ నిర్ణయం భారత్‌కు దక్షిణాఫ్రికా చేతిలో భారీ ఓటమికి కారణమైంది. అంతే కాదు అప్పటివరకూ వరుసగా నాలుగు గ్రూప్ మ్యాచ్ లు గెలిచి ఫైనల్ ఫేవరెట్లలో ముందున్న టీమిండియా ఆటతీరుపై అనుమానాల్ని రేకెత్తించింది. అయితే ఈ దెబ్బ నుంచి వేగంగా కోలుకున్న భారత్.. తర్వాత జరిగిన జింబాబ్వే, వెస్టిండీస్ మ్యాచ్ ల్లో ఘన విజయాలతో సెమీస్ చేరడం, అక్కడ ఇంగ్లాండ్ ను ఓడించి ఫైనల్ చేరడం, చివరిగా కివీస్ ను ఇంటికి పంపడం జరిగిపోయాయి. అయితే కెప్టెన్ సూర్య మాత్రం తన తప్పిదాన్ని నిజాయితీగా అంగీకిరించడంతో పాటు అక్షర్ కు సారీ చెప్పడంతో అభిమానులు స్కైపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

దక్షిణాప్రికా మ్యాచ్ కు తప్పించిన తన నిర్ణయంపై అక్షర్ చాలా కోపంగా ఉన్నాడని, అతను అలా ఉండటంలో తప్పేమీ లేదని సూర్య తెలిపాడు. ఎందుకంటే అతను అనుభవజ్ఞుడైన ఆటగాడని, ఓ ఐపీఎల్ జట్టును నడిపిస్తున్నాడని గుర్తుచేశాడు. అందుకే తాను క్షమాపణలు చెప్పానని, అతనితో తప్పు చేశానని చెప్పానని, తనను క్షమించాలని కోరానని చెప్పుకొచ్చాడు. కానీ అది జట్టు కోసం తీసుకున్న ఓ నిర్ణయమని, అయితే అక్షర్ కు దీన్ని చెప్పడం కష్టమైందన్నాడు. అయితే అక్షర్ మాత్రం దాన్ని ధైర్యంగా తీసుకున్నాడని, మరుసటి రోజే తాము ఈ చర్చను ముగించామని వెల్లడించాడు.












Click it and Unblock the Notifications