T20 World Cup 2026: బంగ్లాదేశ్ బెట్టు, పాక్ రియాక్షన్
ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్న 2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ క్రమంలోనే భారత్‌లో జరగనున్న 2026 టీ20 ప్రపంచకప్ చుట్టూ మళ్లీ రాజకీయ ముసురు కమ్ముకుంటోంది. భద్రత, జాతీయ గౌరవం పేరుతో భారత్‌లో మ్యాచ్‌లు ఆడబోమంటూ బంగ్లాదేశ్ తెగేసి చెప్పడం, దీనికి పాకిస్థాన్ కూడా సంఘీభావం తెలుపుతుందన్న వార్తలు క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఇండియా–పాక్ మధ్య ఉన్న ఉద్రిక్తతల నడుమ ఈ పరిణామాలు టోర్నీ భవితవ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
కోల్‌కతా, ముంబయిలలో జరగాల్సిన తమ మ్యాచ్‌ల కోసం భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరిస్తుండటమే కాకుండా… ఈ నిర్ణయం వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని బీసీబీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. భద్రతా పరిస్థితులు అనుకూలంగా లేవన్నదే బంగ్లా వాదనగా వినిపిస్తోంది.

పాకిస్థాన్ రియాక్షన్..
ఈ వ్యవహారంపై పాకిస్థాన్ కూడా ప్రపంచకప్‌ను బహిష్కరించే ఆలోచనలో ఉందన్న కథనాలు మీడియాలో హల్‌చల్ చేశాయి. అయితే తాజాగా స్పందించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు… ఈ వార్తలను పూర్తిగా ఖండించింది.“అవి కేవలం ఊహాగానాలు మాత్రమే. బంగ్లాదేశ్ ఏ నిర్ణయం తీసుకున్నా, మేం టోర్నీ నుంచి వైదొలగే ప్రశ్నే లేదు” అని స్పష్టం చేసింది.
ఎందుకు బహిష్కరించాలి?
ముఖ్యంగా, “2025 ఆరంభంలో కుదిరిన ఒప్పందం ప్రకారం మా మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే షెడ్యూల్ అయ్యాయి. అలాంటప్పుడు మేం భారత్‌కు రావడం లేదన్న కారణంతో టోర్నీని ఎందుకు బహిష్కరించాలి?” అంటూ పీసీబీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇండియా–పాక్ మధ్య ఉన్న సున్నిత పరిస్థితులను మరింత రెచ్చగొట్టేందుకే ఇలాంటి వార్తలు వెలువడుతున్నాయని కూడా పరోక్షంగా ఆరోపించాయి.
ఐసీసీ ఒత్తిడికి తలొగ్గం: బంగ్లాదేశ్
ఇదిలా ఉండగా… బంగ్లాదేశ్ భారత్‌కు రాకపోతే ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను ఆడించాలన్న ఐసీసీ ఆలోచనలపై వార్తలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన బంగ్లాదేశ్ ప్రభుత్వ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్… తీవ్రంగా మండిపడ్డారు.
“ఐసీసీ ఎలాంటి అధికారిక సమాచారం మాకు ఇవ్వలేదు. ఒత్తిడి చేసి మమ్మల్ని భారత్‌లో మ్యాచ్‌లు ఆడించలేరు. బంగ్లాదేశ్ స్థానంలో వేరే జట్టును ఆడిస్తామని చెప్పడం పూర్తిగా ఊహాజనితం” అని స్పష్టం చేశారు.
అదే సమయంలో, స్కాట్లాండ్ కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. తమతో ఇప్పటివరకు ఐసీసీ ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ప్రకటించింది.
మళ్లీ క్రికెట్‌కు రాజకీయాల ముసురు?
ఒకవైపు భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు… మరోవైపు బంగ్లాదేశ్ భద్రతా బెట్టు… ఇవన్నీ కలిసి 2026 టీ20 వరల్డ్ కప్‌ను రాజకీయ రంగు పులుముకునే దిశగా నడిపిస్తున్నాయి. ఐసీసీ ఎలా స్పందిస్తుంది? భారత్ వేదికగా జరిగే మెగా టోర్నీపై ఈ వివాదాల ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది ఇప్పుడు క్రికెట్ ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రశ్న.












Click it and Unblock the Notifications