ఊహించని షాకిచ్చిన బీసీసీఐ: భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్‌కు నో ఎంట్రీ!
T20 World Cup 2025: టీ20 ప్రపంచ కప్ 2026 వేళ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్లేయర్లకు సంబంధించి ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మెగా ఐసీసీ టోర్నీలో రాణించాలని కష్టపడుతున్న టీమిండియాకు బీసీసీఐ నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టోర్నమెంట్ సమయంలో తమ కుటుంబ సభ్యులను (భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్)తమతో పాటు ఉంచుకునేందుకు ఆటగాళ్లు చేసిన విన్నపాన్ని బోర్డు తిరస్కరించినట్లు సమాచారం. మెగా టోర్నీ కావడంతో ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సూర్య అభ్యర్థనను తిరస్కరించిన బోర్డు?
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు టోర్నీ పొడవునా ఫ్యామిలీ మద్దతు అవసరమని భావించి అనుమతి కోరగా, బోర్డు దానికి సమ్మతించలేదని తెలుస్తోంది. అయితే దీనిపై బీసీసీఐ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో కొన్ని విదేశీ పర్యటనలలో కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చినప్పటికీ.. వరల్డ్ కప్ వంటి ఒత్తిడితో కూడిన టోర్నీలలో మాత్రం బోర్డు కట్టుదిట్టమైన నిబంధనలను అమలు చేస్తోంది.

కోచ్ గౌతమ్ గంభీర్ కఠిన వైఖరి?
ఈ నిర్ణయం వెనుక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రభావం కూడా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గంభీర్ క్రమశిక్షణకు, ఆటపై పూర్తి ఏకాగ్రతకు ప్రాధాన్యత ఇస్తారనే విషయం తెలిసిందే. టోర్నీ మధ్యలో ఆటగాళ్లకు కుటుంబ పరమైన పరధ్యానం ఉండకూడదని, కేవలం క్రికెట్ పైనే దృష్టి పెట్టాలనేది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. మైదానంలో వంద శాతం ఫలితం సాధించాలంటే ఇటువంటి కఠిన నిర్ణయాలు అవసరమని కోచ్, బోర్డు పెద్దలు భావిస్తున్నారు.
క్రికెట్ అభిమానుల్లో చర్చ
సాధారణంగా ఫ్యామిలీ తోడుగా ఉంటే ఆటగాళ్లకు మానసిక ప్రశాంతత లభిస్తుందని కొంతమంది వాదిస్తుండగా.. అది ఆటగాళ్లను డైవర్ట్ చేసే అవకాశం ఉంటుందని మరికొందరు బోర్డు నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. టోర్నీ ప్రారంభ దశలో ఇటువంటి వార్తలు రావడం జట్టులో ఎటువంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications