T20 World Cup: ఇన్ని కష్టాల మధ్య టీమిండియాకు ఓ గుడ్ న్యూస్..!
టీ20 వరల్డ్ కప్ (t20 world cup 2026)లో డిఫెండింగ్ ఛాంపియన్ గా భారత్ (india)అడుగుపెట్టింది. అక్కడి నుంచే టైటిల్ ఫేవరెట్ గా రేసులో నిలిచింది. తర్వాత గ్రూప్ ఏలో వరుసగా నాలుగు మ్యాచ్ లు నెగ్గి సగర్వంగా సూపర్ 8లోకి అడుగుపెట్టింది. దీంతో ఇక టైటిల్ నెగ్గడం సూర్య సేనకు నల్లేరుపై నడకేనని అంతా భావించారు. అక్కడే ఎవరి దిష్టి తగిలిందో కానీ సీన్ మారిపోయింది. సూపర్ 8 తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన భారీ ఓటమి, తాజాగా జింబాబ్వేపై విండీస్ భారీ గెలుపు, తర్వాత రింకూ సింగ్ తండ్రి అనారోగ్యంతో టీమ్ కు దూరం కావడం.. ఇలా వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
ఇన్ని ఇబ్బందుల మధ్య రేపు భారీ తేడాతో గెలవక తప్పని మ్యాచ్ లో జింబాబ్వే (Zimbabwe)ను ఎదుర్కొనేందుకు టీమిండియా సిద్దమైంది. ఇప్పటికే అహ్మదాబాద్, ముంబై వాంఖడే పిచ్ లపై ఆశించిన రీతిలో బంతి బ్యాట్ పైకి రాకపోవడంతో టీమిండియాకు ఇబ్బందులు తప్పలేదు. ఫామ్ లో ఉన్న బ్యాట్స్ మెన్ సైతం ఇబ్బందులు పడుతున్న పరిస్ధితి. కానీ ఇప్పుడు జింబాబ్వేతో మ్యాచ్ కు వేదికైన చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో మాత్రం భారత్ కు అనుకూలమైన పిచ్ సిద్దం చేశారు.

చిదంబరం స్టేడియంలో కొత్తగా తయారు చేసిన పిచ్ పై భారత్-జింబాబ్వే మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే దేశవాళీ మ్యాచ్ లకు వాడేసిన పిచ్ లు బ్యాటర్లకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయన్న విమర్శల నేపథ్యంలో చెన్నైలో కొత్తగా తయారు చేసిన ఫ్లాట్ పిచ్ భారత బ్యాటర్లకు అనుకూలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే విండీస్ తరహాలో మన బ్యాటర్లు జింబాబ్వేను ఓ ఆటాడుకోవడం ఖాయం. అలాగే భారీ తేడాతో ఈ మ్యాచ్ గెలిస్తే సెమీస్ అవకాశాలు కూడా మెరుగుపడతాయని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications