మాజీ ఛాంపియన్లలో వణుకు, కొత్త లెక్కలు - సూపర్ 8 రేసుకు చేరేదెవరు..!!
T20 World Cup 2026: ప్రపంచ కప్ సమరం ఆసక్తి కరంగా మారుతోంది. లీగ్ మ్యాచుల్లోనే సంచనాలు నమోదవుతున్నాయి. డబుల్ సూపర్ ఓవర్ల స్థాయిలో ఉత్కంఠ పెంచుతున్నాయి. చిన్న జట్లు పెద్ద టీంలకు వణుకు పుట్టిస్తున్నాయి. దీంతో.. పాయింట్ల పట్టికలోనూ ప్రకంపణలు మొదలయ్యాయి. మాజీ ఛాంపియన్లలో టెన్షన్ మొదలైంది. అసలు సూపర్ 8కు ఎవరు చేరుతారు అనేది ఇప్పుడు చెప్పటం సంక్లిష్టంగా కనిపిస్తోంది. విండీస్ జోరు మీద ఉంటే.. ఇంగ్లాండ్ వెనుక బడి ఉంది. దీంతో.. అసలు ఎవరికి సూపర్ 8 ఛాన్స్ ఉంటుందనేది ఆసక్తిగా మారుతోంది.
ప్రపంచ కప్ క్రికెట్ ఫ్యాన్స్ మజా అందిస్తోంది. మ్యాచ్ లు జరుగుతున్న కొద్దీ పాయింట్ల పట్టికలో మార్పులు జరుగుతున్నాయి. తాజా మ్యాచ్ లో వెస్టిండీస్ చేతిలో ఇంగ్లాండ్ ఓడిపోవడంతో సూపర్-8 ఈక్వేషన్స్ ఆసక్తి కరంగా మారాయి. డిఫెండింగ్ ఛాంపియన్లుగా వెలిగిన ఇంగ్లాండ్ టీమ్, ఇప్పుడు తదుపరి రౌండ్‌కు చేరుతుందా లేదా అనేది సందేహంగా మారుతోంది. తాజా పాయింట్ల పట్టిక ప్రధాన టీంలకు టెన్షన్ పెంచుతోంది. తాజా పోరులో వెస్టిండీస్ 30 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది.

దీంతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన వెస్టిండీస్ 4 పాయింట్లతో గ్రూప్-సిలో అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. స్కాట్లాండ్ కంటే తరువాతి స్థానంలో ఉంది. సూపర్-8కి వెళ్లాలంటే ఇంగ్లాండ్ ఇకపై ప్రతి మ్యాచ్ తప్పక గెలవాలి. ఇతర టీంల ఫలితాలు కీలకం కానున్నాయి. సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ప్రపంచ కప్ మజాను పంచింది. సౌతాఫ్రికా విజయం సాధించినా.. పాయింట్ల పట్టికలో మాత్రం రెండో స్థానానికే పరిమితమైంది.
కాగా, ఇదే గ్రూప్ లో న్యూజిలాండ్ (+1.919) రన్ రేట్ సౌతాఫ్రికా (+1.425) కంటే మెరుగ్గా ఉండటంతో కివీస్ జట్టు తొలి స్థానంలో నిలిచింది. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా తన మొదటి మ్యాచ్ లో నే భారీ విజయాన్ని అందుకొని పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇతర జట్లతో పోలిస్తే ఆసీస్ రన్ రేట్ అత్యధికంగా ఉండటంతో ప్రస్తుతానికి ఆ గ్రూప్‌లో వాళ్లే తొలి స్థానంలో కొనసాగే ఛాన్స్ ఉంది. కాగా.. గ్రూప్-ఏలో పాకిస్థాన్ రెండు మ్యాచ్‌లకు రెండు గెలిచి 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.
అయితే టీమిండియా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడి విజయం సాధించింది. నేడు నమీబియాతో జరగబోయే మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధిస్తే, పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి నంబర్ వన్ పొజీషన్ లో నిలుస్తుంది. ప్రస్తుతానికి భారత్ నెట్ రన్ రేట్ పాక్ కంటే చాలా మెరుగ్గా ఉంది. ఇక.. 15వ తేదీన భారత్ - పాక్ మ్యాచ్ కీలకం కానుంది. దీంతో.. అసలు ఎవరు ఏ స్థానంలో నిలుస్తారు.. ఎవరు సూపర్ 8 కి చేరుతారనేది ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications