భారత జట్టులో భారీ కుదుపులు.. మార్పులు
IND vs ENG 4th test: ఇంగ్లాండ్ తో జరుగుతున్న అండర్సన్- టెండుల్కర్ టెస్ట్ సిరీస్ లో భారత్ వెనుకంజలో ఉంది. గెలవాల్సిన మూడో మ్యాచ్ ఘోరంగా ఓడిపోయింది. చేతులకు అందిన మ్యాచ్ ను నోటి దాకా తీసుకెళ్లడంలో విఫలమైంది. 22 పరుగుల తేడాతో మట్టికరిచింది. అయిదు మ్యాచ్ ల ఈ సిరీస్ లో 2-1 తేడాతో వెనుకపడింది.
ఇప్పటికే సిరీస్ పై పట్టు సాధించిన ఇంగ్లాండ్.. మాంచెస్టర్ టెస్ట్ ను కైవసం చేసుకోవడానికి ఉవ్విళ్లూరుతోంది. సిరీస్ డిసైడర్ ఇది. ఇందులో గెలిస్తే- సిరీస్ ఇంగ్లాండ్ వశమౌతుంది. చివరి మ్యాచ్.. ఆధిక్యతను మరింత పెంచుకోవడానికో, తగ్గించుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.

ఈ పరిణామాల మధ్య భారత జట్టులో భారీ మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి. సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూర్ తిరిగి జట్టులోకి రావడం ఖాయమైంది. వీరిద్దరితో పాటు అన్షుల్ కాంబోజ్ మాంచెస్టర్‌లో టెస్ట్ అరంగేట్రం చేయనున్నాడు. అలాగే కరుణ్ నాయర్‌ను పక్కన పెట్టాలని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్‌కు అవకాశం ఇవ్వాలని భారత్ భావిస్తోంది. ఈ సిరీస్‌లో భారత్ తన బ్యాటింగ్ లైనప్ లో కీలకమైన మూడవ స్థానాన్ని మార్చడం ఇది రెండోసారి అవుతుంది. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్ట్ లో సాయి సుదర్శన్ వన్ డౌన్‌లో బ్యాటింగ్ చేశాడు. కరుణ్ నాయర్ లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్‌కు దిగాడు.
రెండు, మూడవ టెస్టులకు సుదర్శన్‌ను తప్పించి కరుణ్ నాయర్‌ను మూడవ స్థానంలో ఆడించారు. ఇప్పుడు మళ్లీ సుదర్శన్‌కు అవకాశం ఇవ్వాలని చూస్తుండగా, నాయర్‌కు చోటు దక్కే అవకాశం లేదు. గాయాల కారణంగా మాంచెస్టర్ టెస్ట్ ప్లేయింగ్ 11లో మరో రెండు మార్పులు చేయవలసి వచ్చింది.
ఆకాష్ దీప్ స్థానంలో హర్యానా పేసర్ అన్షుల్ కాంబోజ్, నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో శార్దూల్ ఠాకూర్ వచ్చే అవకాశం ఉంది. లార్డ్స్, బర్మింగ్‌హామ్‌లలో మాదిరిగానే భారత్ ఆరుగురు బౌలింగ్ ఎంపికలతో బరిలోకి దిగనుంది. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఆల్‌రౌండర్లు కాగా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కంబోజ్ పేసర్లుగా జట్టులో ఉంటారు.
సుదర్శన్ ఆడిన ఏకైక టెస్టులో 0, 30 పరుగులు చేశాడు. జట్టు కూర్పు కారణంగా అతన్ని తొలగించారు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు తన స్థానాన్ని కోల్పోయాడు. కరుణ్ నాయర్ ఆడిన ఇన్నింగ్స్‌లలో 0, 20, 31, 26, 40, 14 పరుగులు చేశాడు. అతను విఫలమౌతోండటంతో మళ్లీ సుదర్శన్ వైపు మొగ్గు చూపింది టీమ్ మేనేజ్మెంట్.
కరుణ్ నాయర్ కు అండగా నిలిచాడు కేప్టెన్ శుభ్‌మన్ గిల్. మాంచెస్టర్ మ్యాచ్‌లో కరుణ్‌కు మరికొంత అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. కరుణ్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడని భావిస్తున్నామని, అతని బ్యాటింగ్ టెక్నిక్ లో ఎటువంటి సమస్య లేదని అన్నాడు. ఒక్కసారి అతను ఫామ్ ను అందిపుచ్చుకుంటే భారీ ఇన్నింగులు ఆడతాడని వ్యాఖ్యానించాడు.












Click it and Unblock the Notifications