బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ
ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్, టీమిండియా యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ అంత భీకరంగా ఏం అనిపించలేదని రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తెలిపాడు. తాను బుమ్రా కంటే బంతిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టడానికి ప్రయత్నించానని వెల్లడించాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ(14 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 39) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఈ 15 ఏళ్ల బుడ్డోడు బుమ్రా బౌలింగ్‌ను చెడుగుడు ఆడాడు. తన కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్ బుమ్రా బౌలింగ్‌ను ఆడుతున్నాననే బెరుకు లేకుండా చెలరేగాడు. తాను ఎదుర్కొన్న 3 బంతుల్లో 2 భారీ సిక్స్‌లు కొట్టాడు. వైభవ్ విధ్వంసం ముందు వరల్డ్ బెస్ట్ పేసర్ అయిన బుమ్రా తేలిపోయాడు.

కాస్త కంగారు పడినా..
వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో వైభవ్‌కు తోడుగా యశస్వి జైస్వాల్(32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 నాటౌట్) చెలరేగడంతో రాజస్థాన్ రాయల్స్ 27 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా టీమ్‌తో మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ.. బుమ్రా బౌలింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. బుమ్రా బౌలింగ్‌లో కొంత కంగారుపడినా.. తనకు అలవాటైన రీతిలో చెలరేగానని చెప్పాడు.
అంత ఏం లేదు..
'జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ అంత ఇబ్బందిగా ఏం అనిపించలేదు. నేను బుమ్రా కంటే ఎక్కువగా బంతిని చూసి ఆడాను. ఆరంభంలో బుమ్రాను చూడగానే కాస్త కంగారుపడ్డాను. కానీ నా సహజసిద్దమైన ఆటపై నమ్మకం ఉంచి.. బౌలర్ కంటే బంతిని మాత్రమే చూసి బాదేందుకు ప్రయత్నించాను.
మ్యాచ్‌కు ముందు నిర్వహించే ప్రాక్టీస్ సెషన్స్ నాకు చాలా ఉపయోగపడుతాయి. ఎందుకంటే త్రోడౌన్ స్పెషలిస్ట్‌లు చాలా తక్కువ దూరం నుంచి వేగవంతమైన బంతులను విసురుతారు. ఈ ప్రాక్టీస్ వల్ల మ్యాచ్‌లో బౌలర్‌ను ఎదుర్కొనేటప్పుడు బంతిని చూసి ఆడటానికి నాకు అదనపు సమయం దొరుకుతుంది.
ప్రత్యేకంగా సిద్దమయ్యా..
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ తర్వాత నా బ్యాటింగ్‌లో లోపాలు ఉన్నాయనిపించింది. వాటిని సరిచేసుకోవడంపై ఫోకస్ పెట్టాను. ముంబైతో మ్యాచ్‌కు ముందు త్వరగా ప్రాక్టీస్‌కు వెళ్లి నెట్స్‌లో శ్రమించాను. ఆ ప్రాక్టీస్ సెషన్ నాకు బాగా సహాయపడింది.
గత రెండు ఇన్నింగ్స్‌ల్లో నేను మంచి షాట్లు ఆడి ఔట్ అయ్యాను. గుజరాత్‌తో మ్యాచ్‌లోనూ మంచి షాట్ ఆడాను. కానీ నేరుగా ఫీల్డర్ చేతుల్లో పడింది. ముంబైతో మ్యాచ్‌లో నేను ఇన్నింగ్స్ మొత్తం ఆడి ఉంటే.. భారీ స్కోర్ నమోదయ్యేది.'అని వైభవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు.












Click it and Unblock the Notifications