ఆర్సీబీ ఇక అవుటాఫ్ బెంగళూరు: క్లియర్ కట్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో అడుగు ముందుకేసింది. సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్ ను మట్టికరిపించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియానికి ఘన విజయంతో వీడ్కోలు పలికింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో 205 పరుగులు చేయగా.. దీన్ని అలవోకగా అందుకుంది రాయల్ ఛాలెంజర్స్ టీమ్. 18.5 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. దేవ్ దత్ పడిక్కల్ క్లాసిక్ ఇన్నింగ్ తో కట్టిపడేశాడు.
ఈ ఐపీఎల్ సీజన్ లో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ కు ఇదే చివరి మ్యాచ్. ఇకపై ఆడే మ్యాచ్ లన్నీ కూడా అవుటాఫ్ బెంగళూరే. దీంతో ఈ మ్యాచ్ లో ఘన విజయం సాధించి సొంతగడ్డకు వీడ్కోలు చెప్పాలనే కలను సాకారం చేసుకోగలిగింది.. రజత్ పటిదార్ సేన. ఈ నెల 27న తన తదుపరి మ్యాచ్ ఆడబోతోంది ఆర్సీబీ. ఢిల్లీ కేపిటల్స్ ను ఢీకొట్టబోతోంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.

దీని తర్వాత ఈ నెల 30న మరోసారి గుజరాత్ టైటాన్స్ తో తలపడుతుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం దీనికి వేదిక. అనంతరం మే 7వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్ తో వారి సొంత గడ్డ లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి ఏక్నా స్టేడియంలో ఆడుతుంది. అదే నెల 10వ తేదీన ముంబై ఇండియన్స్ తో ఆడాల్సి ఉంది. రాయ్ పూర్ ఈ మ్యాచ్ కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ముంబై ఇండియన్స్ కు రెండో హోమ్ గ్రౌండ్ ఇది.
మే 13న రాయ్ పూర్ లోనే కోల్ కత నైట్ రైడర్స్ తో తలపడుతుంది. అలాగే 17న ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, 22న ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లను ఆడుతుంది. ఈ సీజన్ లో ఆర్సీబీ చివరి మ్యాచ్.. సన్ రైజర్స్ తోనే. 22న జరిగే ఈ మ్యాచ్ తో ఆర్సీబీ లీగ్ మ్యాచ్ లన్నీ కూడా ముగుస్తాయి. అప్పటికి ప్లేఆఫ్స్ ఏమిటనేది క్లియర్ కట్ గా తేలిపోతుంది.












Click it and Unblock the Notifications