అతను పెళ్లి చేసుకోవాలంటే విరాట్ కోహ్లీ కనికరించాలి..!!
న్యూఢిల్లీ: వరల్డ్ కప్ 2023లో భాగంగా భారత్.. తన రెండో మ్యాచ్ ఆడుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో కొద్దిసేపటి కిందటే మొదలైందీ గేమ్. ఈ రెండు జట్లకూ ఇది రెండో మ్యాచ్. తొలి మ్యాచ్‌లో భారత్.. తన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. దీనికి భిన్నంగా ఆఫ్ఘనిస్తాన్.. బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపాలైంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆఫ్ఘనిస్తాన్ జట్టు. ఓవర్‌కు ఆరు పరుగుల చొప్పున పరుగులను రాబట్టుకుంటూ దూకుడుగా ఇన్నింగ్ ఆరంభించింది గానీ.. వికెట్ కోల్పోవడం ఆ జట్టుకు స్పీడ్ బ్రేకర్‌గా మారింది. ఓపెనర్ ఇబ్రహీ జడ్రాన్ అవుట్ అయ్యాడు. 28 బంతుల్లో నాలుగు ఫోర్లతో 22 పరుగులు చేసిన అతణ్ని జస్‌ప్రీత్ బుమ్రా పెవిలియన్ దారి పట్టించాడు.

135 కిలోమీటర్ల వేగంతో బుమ్రా చేతి నుంచి వెలువడి, హాఫ్ స్టంప్ మీద పడిన ఈ స్ట్రెయిటర్‌ను షాట్ ఆడటానికి ప్రయత్నించాడు జడ్రాన్. టైమింగ్ మిస్ అయ్యాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి నేరుగా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చేతుల్లో వాలింది. జడ్రాన్ రూపంలో 32 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆఫ్ఘన్.
ప్రస్తుతం మరో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్- 10, వన్ డౌన్ బ్యాటర్ రహ్మత్ షా- 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌కు కీలక మ్యాచ్ ఇది. వరల్డ్ కప్ రేసులో నిల్చోవాలంటే గెలిచి తీరాల్సి ఉంటుందా జట్టుకు. పాకిస్తాన్ మ్యాచ్ ముందు భారీ విజయం మీద కన్నేసింది రోహిత్ సేన.
కాగా- ఈ మ్యాచ్‌లో ఓ ప్లకార్డ్ అందరి దృష్టినీ ఆకట్టుకుంది. టీమిండియా బ్యాటింగ్ మెషీన్ విరాట్ కోహ్లీ అభిమాని ప్రదర్శనించిన ప్లకార్డ్ అది. విరాట్ కోహ్లీ 50వ వన్డే ఇంటర్నేషనల్ సెంచరీ చేసిన తరువాతే పెళ్లి చేసుకుంటాను అని ఆ ప్లకార్డ్‌పై రాసిన ప్లకార్డ్‌ను డిస్‌ప్లే చేశాడు. ఇది కాస్త వైరల్‌గా మారింది.
ఆ అభిమాని కోరిక త్వరలోనే తీరొచ్చనడంలో సందేహాలు అక్కర్లేదు. ఎందుకంటే వన్డే ఇంటర్నేషనల్స్‌లో విరాట్ కోహ్లీ చేసిన సెంచరీల సంఖ్య 47. 50 ల్యాండ్ మార్క్‌ను అందుకోవడానికి అతను ఇంకో మూడు సెంచరీల దూరంలో నిలిచాడు. ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు కోహ్లీ. ఆస్ట్రేలియాపై 85 పరుగులతో సత్తా చాటాడు. ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్ ముగిసేసరికి ఒకటో రెండో సెంచరీలను బాదినా ఆశ్చర్యపోనవసరం లేదు.












Click it and Unblock the Notifications