విద్యావ్యాపారంపై హైకోర్టు కొరడా
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్ధలు పచ్చి వ్యాపార సంస్ధలుగా మారిపోవడం చాలాకాలంగా ఆందోళన కలిగిస్తున్న విషయం. ప్రైవేటు విద్యా సంస్ధలు, కోచింగ్ సెంటర్లు చిల్లర కిరాణా దుకాణాలుగా మారిపోయాయని నేడు శుక్రవారం హైకోర్టు విచారం వ్యక్తం చేస్తూ ఒక ముఖ్యమైన ఆదేశాన్ని జారీ చేసింది. ఈ విద్యా సంస్ధలు మీడియాలో వ్యాపారప్రకటనలు ఇవ్వరాదని ఆదేశించింది. ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణ మార్చి నాలుగో తేదీన జరుగుతుంది.
రాష్ట్రంలో ఎనబైయ్యో దశాబ్దం మధ్య నుంచి పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేటు జూనియర్ కళాశాలలు, పాఠశాలల మధ్య నేడు గొంతు కోత పోటీ నెలకొని ఉంది. ఆస్తులను తెగనమ్మి అయినా పిల్లలను బాగా చదివించాలన్న తలిదండ్రుల ఆతృతను ఈ విద్యాసంస్ధలు బాగా సొమ్ము చేసుకుంటున్నాయి. పిల్లలు కట్టే ఫీజులో గణనీయ భాగాన్ని వాణిజ్య ప్రకటనలపై ఖర్చు చేస్తున్నాయి. వాణిజ్యప్రకటనల్లో కనీస నైతిక ప్రమాణాలను పాటించడం లేదు. ర్యాంకులు సాధించిన విద్యార్ధినీ, విద్యార్ధుల ఫోటోలు ఒకటి కంటే ఎక్కువ విద్యాసంస్ధల పత్రికా ప్రకటనల్లో కన్పించడం విశేషం. రాష్ట్రంలో అరడజను అతి పెద్ద ప్రైవేటు విద్యా సంస్ధలున్నాయి. మరో పది సంస్ధలు మీడియం రేంజిలో ఉన్నాయి. ఈ విద్యా సంస్ధల అడ్వర్టయిజ్‌మెంట్ల బడ్జెట్ గత ఏడాది పన్నెండు కోట్లు కాగా ఈ సీజన్‌లో 15 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఈ విద్యా సంస్ధలు ఇచ్చే వ్యాపార ప్రకటనలు తలిదండ్రులను, విద్యార్ధులను తప్పుదోవపట్టించేలా ఉన్నాయి.
పవిత్రమైన విద్యా సంస్ధల్లో నైతిక ప్రమాణాలను పాటిస్తారని జనం ఆశించడంలో తప్పులేదు. కానీ ఈ విద్యా సంస్ధలి ఫక్తు వ్యాపార సంస్ధలుగా మారిపోయి, క్షీణ విలువలకు కేంద్రాలుగా మారిపోయాయి. మాఫియా సంస్కృతికి కూడా ఈ సంస్ధల్లో చోటు చేసుకుంది. ప్రైవేటు షోరూములుగా ఈ సంస్ధలు మారిపోయాయి. ఇక్కడ వినియోగదారులైన విద్యార్ధినీ విద్యార్ధులు, తలిదండ్రులు దారుణంగా మోసపోతున్నారు. విద్యా సంస్ధలు పాపభీతి లేకుండా సంపాదిస్తున్న మొత్తాల్లో కొంత భాగం ప్రింట్, టీవీ మీడియాలకు యాడ్స్ రూపంలో చేరుతోంది. ఫలితంగా ఈ సంస్ధల్లో జరిగే అక్రమాలు మీడియాలో రావడంలేదు. నేడు ప్రకటనలను నిరోధిస్తూ హైకోర్టు ప్రకటించిన నిర్ణయం ప్రింట్, టీవీ మీడియాల యాజమాన్యాలకు అశనిపాతంలా తగిలింది. న్యాయస్ధానాలు మెరుగైన సమాజ స్ధాపనకు కృషి చేస్తున్నాయనడానికి నేటి మధ్యంతర తీర్పు ఒక ఉదాహరణ.












Click it and Unblock the Notifications
