చిరుది మెగా ప్రభంజనమే

చిరంజీవి రేపు సాయంత్రం ప్రజా అంకితయాత్రకు బ్రేక్ వేసుకుని, తన గొంతుకు స్వస్ధత చేకూరిన తర్వాత మళ్ళీ విశాఖ సరిహద్దు ప్రాంతాల నుంచి యాత్ర మొదలు పెట్టి, తనకు అత్యంత కీలకమైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో ఆయనకు జనం మరింతగా బ్రహ్మరథం పడతారని నివేదికలు చిరు శిబిరానికే గాక ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా ప్రభుత్వానికి అందాయి. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ కాపు నాయకుడు, రాష్ట్ర మంత్రి జక్కంపూడి రామమోహనరావు తీవ్ర అస్వస్ధతతో ఢిల్లీ స్విమ్స్ లో చికిత్స పొందడం అధికార కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా ఉంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకును కాపాడే బాధ్యతను ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పొరుగు జిల్లాలకు చెందిన కాపు మంత్రులకు అప్పగించినట్టు తెలుస్తోంది.
"ఈ రాజకీయ రొంపిలోకి ఎందుకు వచ్చానురా బాబూ" అన్నట్టు తొలి రోడ్ షోలలో బిడీయంగా వ్యవహరించిన చిరంజీవి తీరు ఈ వారం రోజుల్లో బాగా మారింది. జనం హర్షధ్వానాలను ఆయన ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. దాదాపు ముప్పై ఏళ్ళ పాటు మేకప్ వేసుకుని షూటింగ్ లైట్ల మధ్య గడిపిన ఆయనకు ఇది నిజంగా కొత్త అనుభవమే. పర్సనాలిటీ డెవలప్ మెంటు నిపుణులు చెబుతున్న చిట్కాలను చిరంజీవి అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఏదైనా మార్పు వచ్చినప్పుడు దానిని పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తూ, విజయం సాధించాలన్నది ఆయన లక్ష్యంగా మారింది.
ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పది శాతం పెత్తందారి వర్గాల వారి ప్రయోజనాలకు ఢోకా ఉండదు. పెద్ద కాంట్రాక్టర్లు ఆ రెండు సామాజిక వర్గాలకు చెందిన వారే. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, తెలుగుదేశం అధికారంలో ఉన్నా ఆ రెండు అగ్రకులాలకు చెందిన వారికే సింహ భాగం దక్కుతోంది. చిరంజీవి పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తే ఈ రాజకీయ, వ్యాపార దళారులు కొన్ని డబ్బు సంచులను చిరు శిబిరానికి కూడా పంపిస్తారనడంలో సందేహం లేదు. వాటిని తిరస్కరించి జనం కోసం నిలబడాలన్న సంకల్పంతో చిరు శిబిరం వ్యవహరిస్తుందా? ఏ విషయం ఇప్పుడే చెప్పలేం. బెల్లం చుట్టూ మూగే ఈగలను ఎవరు తరిమి కొట్టగలరు?
సామాన్య ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నది చిరంజీవి రోడ్ షోల ద్వారా బహిర్గతమైంది. పొలాల మధ్య నుంచి జనం పరుగులెత్తుకు వస్తున్న దృశ్యాలు చిరంజీవి విశాఖ పట్నం రోడ్ షోలలో కన్పిస్తున్నాయి. వాళ్ళు "తరలించిన" జనం కాదు. ఆ విషయాన్ని ప్రధాన రాజకీయ పార్టీల ప్రముఖ నాయకులు ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.












Click it and Unblock the Notifications