చిరంజీవిపై కాపుల అలక!

Chiranjeevi
హైదరాబాద్: చిరంజీవి ప్రజారాజ్యంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాపు, దాని ఉప కులాల వారిలో క్రమంగా నిరాశా నిస్పృహలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర జనాభాలో దాదాపు నాలుగో వంతు జనాభా ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపులు తమకు చిరంజీవి రూపంలో రాజ్యాధికారం సంక్రమించబోతోందని మొదట్లో సంబరపడ్డారు. ఇప్పుడు ఆ ఉత్సాహం కాపు, దాని ఉప కులాల్లో లేదని ఆ సామాజిక వర్గానికి చెందిన ఒక సీనియర్ జర్నలిస్టు చెప్పారు. ఆయన ఈ సందర్భంగా అనేక విషయాలను విశ్లేషించారు. ప్రజారాజ్యం పార్టీలో కాపులు పల్లకీలను మోసే బోయీలుగా మారారని, మెజారిటీ టికెట్లను పెత్తందారులు డేగల్లా ఎగరేసుకుపోయే అవకాశముందని ఆయన అభిప్రాయం.

కులమే సామాజిక, రాజకీయ సత్యమని ఆ విషయాన్ని చిరంజీవి విస్మరిస్తున్నారని, ఇలాగైతే రాజ్యాధికారం ఇప్పట్లో సాధ్యం కాదని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడైనా, రాజశేఖరరెడ్డి అయినా మొదట తమ కులాల వారి సంగతి చూసుకుని ఆయా వర్గాల్లో పట్టు సంపాదించుకున్నారని, చిరంజీవికి ఆ సామాజిక సత్యం బోధపడడం లేదని ప్రజారాజ్యం పార్టీలో చేరి ఇప్పుడు నిర్లక్ష్యానికి గురవుతున్నామన్న అభిప్రాయానికి వచ్చిన వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఉత్తర భారత దేశ రాజకీయాల్లో కులాలకు సంబంధించిన స్పష్టత ఉందని, ఆంధ్రప్రదేశ్ లో కమ్యూనిస్టులు కులం అంటే "స్మరించదగిన విషయం కాదు" అని ప్రచారం చేసి, తమ హిపోక్రసీని చాటుకున్నారని సోషలిస్టు నాయకులు తుర్లపాటి సత్యనారాయణ, సురమౌళి, తుమ్మల చౌదరి ఊరూ వాడా చాటారు.

చిరంజీవికి ఇప్పుడు ఇద్దరు ప్రధాన సలహాదారులు. ఒకరు మాజీ కమ్యూనిస్టు డాక్టర్ మిత్రా. ఆయనకు క్లాస్ మీద తప్ప క్యాస్ట్ మీద అవగాహన లేదు. కులం ముద్ర పడకుండా జాగ్రత్త పడమని ఆయన చిరంజీవికి సలహాలు ఇస్తున్నారు. మరో ప్రధాన సలహాదారు మాజీ సంఘ్ పరివార్ అనుయాయి పరకాల ప్రభాకర్. సైద్ధాంతికంగా ఆయన బిజెపికి, హిందూ మతానికి దగ్గర. ఇటు లెఫ్ట్, అటు రైట్ సలహాలతో చిరంజీవి అయోమయంలో చిక్కుకోవడంలో ఆశ్చర్యం లేదు.

సోషలిస్టు మహానాయకుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా నాలుగు దశాబ్దాల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఒక గొప్ప అంచనా వేశారు. బ్రాహ్మణుల ఆధిపత్యం తర్వాత కొన్ని దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్ తెరమీద రెడ్ల రాజకీయాధికారం ఉంటుందని, ఆ తర్వాత కాపులు, దాని ఉప కులాల వారు అనేక సామాజిక ఆర్ధిక, జనాభా కారణాల వల్ల రాజ్యాధికారంలోకి వచ్చే అవకాశముంది డాక్టర్ లోహియా సిద్ధాంతీకరించారు. ఆ విషయాలు ఆయన రాసిన అనేక ముద్రిత గ్రంధాల్లో చదువుకోవచ్చు. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల రాజకీయ చరిత్రలను మార్చిన డాక్టర్ లోహియా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఒక విషయాన్ని ఊహించలేకపోయారు.

కమ్మ వారికి రాజ్యాధికారం వస్తుందని ఆయన ఊహకు అందలేదు. దానికి కారణం ఎన్టీఆర్ ఆ కులం ప్రతినిధిగా కాకుండా సినిమా గ్లామర్ తో అందరివాడుగా అధికారంలోకి వచ్చారు. అనతి కాలంలోనే ఆ పార్టీపై కులముద్ర పడింది. కమ్మ వారికి రూలింగ్ క్లాస్ లక్షణాలు లేవని, వ్యాపార చతురత వారికి ఎక్కువని, ఎవరు అధికారంలో ఉన్నా తమ వ్యాపార ప్రయోజనాలను రక్షించుకుని ముందుకు సాగిపోయే గొప్ప లక్షణం వారిలో ఉందని సోషియాలజిస్టులు అనేక సందర్భాల్లో చెప్పారు. కష్టించి పనిచేయడం, ఎంత దూరమైనా వలస వెళ్ళి వ్యవసాయం చేసుకుని సంపదను సృష్టించడం, మొత్తంగా సమాజాభివృద్ధికి సహాయపడడం గతంలో కమ్మ కులం ప్రత్యేకత. ఇప్పుడు రాజకీయ కాలుష్యం, సమాజంలోని ఇతర కారణాల వల్ల వ్యవసాయం వెనుకబడింది. గట్ల మీద నిలబడి వ్యవసాయ పనులను పర్యవేక్షించిన వృద్ధులు ఇప్పుడు నగరాల్లో పిల్లల వద్ద ఉంటూ ఉదయం, సాయంత్రం పార్కుల్లో కాలక్షేపం చేస్తున్నారు. గ్రామాల్లో సామాజిక, ఆర్ధీక వ్యవస్ధల్లో మార్పులు వచ్చాయి. అవి మంచికా చెడుకా అన్న దాని మీద లోతైన అధ్యయనం జరగవలసి ఉంది.

కాపు, దాని ఉప కులాల్లో భూమి ఉన్న అగ్రేరియన్ వర్గాలు తక్కువ. ఎక్కువమంది పట్టణాలు, నగరాల్లో వివిధ వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో స్ధిర పడ్డారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మాత్రమే కాపులకు గ్రామాల్లో పట్టు ఉంది. రాజకీయంగా ఈ నాలుగు జిల్లాల్లో మాత్రమే ఒసి కాపులు ముందంజలో ఉన్నారు. తెలంగాణలో మున్నూరు కాపులు వ్యవసాయిక కులం కాకపోయినా వ్యాపారాల్లో ముందు ఉండడం వల్ల వివిధ రాజకీయ పార్టీల్లో రాణిస్తున్నారు. ఈ నేపధ్యంలో చిరంజీవి పార్టీ మీద ఆయన కులం వారు వ్యక్తం చేస్తున్న చిరు ఆగ్రహాన్ని విశ్లేషించి, దాని ప్రభావాన్ని మదింపు చేయవలసిన అవసరముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+