వైఎస్ ది గోల్డెన్ లెగ్గా?

ఇటీవల చంద్రబాబు నాయుడు "మీకోసం" యాత్రలో భాగంగా పర్యటించిన ప్రాంతాల్లో వర్షాలు అర్ధంతరంగా ఆగిపోయాయని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడిని చూసి వానదేవుడే దాక్కుంటున్నాడని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బాబు తన పర్యటనను ముగించుకోవాలని కాంగ్రెస్ జిల్లా స్ధాయి నాయకులు విలేకరుల సమావేశాలు పెట్టి మరీ కోరారు. ఇది వింత పోకడే. ఇప్పుడు చిరంజీవి సభలకు జనం వేలం వెర్రిగా వస్తుండడంతో కాంగ్రెస్ మేధావులు మరో గోబెల్స్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. చిరంజీవి ఇటీవల రోడ్ షోలు నిర్వహించిన మూడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు మొహం చాటేశాయని, చంద్రబాబు నాయుడిలాగే చిరంజీవిది కూడా ఐరన్ లెగ్ అని ప్రచారం సాగుతోంది.
రాష్ట్ర అభివృద్ధికి ఎవరు కృషి చేసినా హర్షించవలసిందే. ఈ విషయంలో రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మేధావులు పెద్ద బుర్రతో కాకుండా పెద్ద మనసుతో వ్యవహరించాల్సి ఉంటుంది. వైఎస్ హయాంలో ఇంత ఎక్కువగా వర్షాలు పడినా, కూరగాయల ధరలు (టమాటో ధర 30 నుంచి 40 రూపాయలు) ఎందుకిలా మండిపోతున్నాయి. కూరగాయ మొక్కలు పూత మీద ఉన్నప్పుడు అధిక వర్షాలు పడి నష్టం జరిగిందని కాంగ్రెస్ నేతలే వివరణ ఇస్తున్నారు. లాభంతో పాటు నష్టం కూడా చేస్తున్న వరుణదేవుడిని తన కేబినెట్ లో చేర్చుకునే విషయంలో ( గెలిస్తే... వచ్చే ఎన్నికల తర్వాత అయినా) వైఎస్ పునరాలోచించుకోవాలేమో!












Click it and Unblock the Notifications