మధ్యంతరంపై చిరు ఆశలు!

వివిధ టీవీ చానల్స్ చేసిన సర్వేలలో ప్రజారాజ్యం మూడో స్ధానంలో ఉందని తేలడంతో "సొంతంగా అధికారం" రాదని ఆ పార్టీ నాయకులకు స్పష్టమైంది. ఈ విషయంలో చిరంజీవి చాలా స్పోర్టివ్ గా ఉన్నారు. సంస్ధాగతంగా పార్టీ బలంగా లేకపోయినా కనీసం 30, 40 స్ధానాలతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర వహించబోవడం చిన్న విషయం కాదన్న అభిప్రాయం ఉంది. చిరంజీవి అప్ సెట్ కాకపోవడానికి కారణం మధ్యంతర ఎన్నికలు వస్తాయని ఆయన భావించడమేనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చిరంజీవి శిబిరంలోని మేధావుల అంచనా ప్రకారం రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుంది. ఏడాది, రెండేళ్ళ లోపు అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. అప్పటికి సంస్ధాగతంగా ప్రజారాజ్యం బలపడుతుంది. 200 స్ధానాలకు తగ్గకుండా సుస్ధిర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. చిరంజీవి కూడా ఈ అంచనాలు నచ్చి హాయిగా కాలక్షేపం చేస్తున్నారు.
అయితే ఈ ఎన్నికల్లో 30 అసెంబ్లీ సీట్లు వస్తే ఏ విధమైన రాజకీయ నిర్ణయం తీసుకోవాలి? యాభై వరకు వస్తే ఏం చేయాలి? వంద వరకు వస్తే ఏ పార్టీల మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు అనే అంశంపై చిరంజీవి సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నారు.
పార్టీని బలోపేతం చేయడానికి కొందరు మేధావులు లిఖితపూర్వకంగా ఇచ్చిన సలహాలను చిరంజీవి క్షుణ్ణంగా చదివి సొంతంగా నోట్స్ తయారు చేసుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ లో సిపిఎం ఎలా సంస్ధాగతంగా ఉక్కు పునాదులు వేసుకుందో ఇక్కడ ప్రజారాజ్యం కూడా అలా తయారు కావాలన్నది చిరంజీవి ఆశయంగా కనిపిస్తోంది. చిరంజీవిలో ప్రగతి శీల భావాలు ఉన్నాయనడానికి అనే దృష్టాంతాలు ఉన్నాయి. మతతత్వ పార్టీగా ముద్రపడిన బిజెపికి దూరంగా ఉంటామని ఆయన ఇటీవల స్పష్టం చేశారు. మార్పు నినాదం వామపక్ష భావజాలం నుంచి పుట్టినదే. సోషలిస్టు భావజాలం నుంచి ఆయన "సామాజిక న్యాయం" అనే అంశాన్ని తీసుకున్నారు.












Click it and Unblock the Notifications