ఇంతకీ అసలు చిరుకెన్ని?

ఆయా నియోజకవర్గాల్లోని పరిస్ధితులు, సామాజిక సమీకరణాలు, ప్రజారాజ్యం అభ్యర్ధుల ఆర్ధిక బలం బట్టి ఆ పార్టీ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఈ సూచికల ప్రకారం ప్రజారాజ్యం పార్టీకి యాభై నుంచి అరవై అసెంబ్లీ స్ధానాలు, ఐదు నుంచి ఏడు వరకు లోక్ సభ స్ధానాలు వచ్చే అవకాశముంది. కేంద్రంలో ఈసారి కూడా సంకీర్ణమే కాబట్టి ఐదు అంతకంటే ఎక్కువ స్ధానాలు వచ్చిన చిన్నా చితకా పార్టీలకు పెద్ద గౌరవం దక్కబోతోంది. ఆ ధైర్యంతోనే "శరద్ పవార్ ప్రధాని పదవికి అర్హులు" అంటూ చిరు భారీ దీర్ఘం తీస్తున్నారు. ప్రజారాజ్యం అంచనాల ప్రకారం అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, నరసాపురం, మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గాల్లో విజయం ఖాయం. తమ అభ్యర్ధి ఇంకా కొంచెం ఎక్కువ డబ్బు ఖర్చు చేసి ఉంటే ఏలూరు లోక్ సభ నియోజకవర్గం కూడా తమకు దక్కి ఉండేదని ప్రజారాజ్యం వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆరేడు లోక్ సభ స్ధానాల పరిధిలో ఒక్కో స్ధానంలో కనీసం ఆరేడు అసెంబ్లీ సీట్లు వస్తాయనుకుంటే, మిగితా చోట్ల అక్కడొకటి అక్కడొకటి రాలితే ఈ యాభై-అరవై అసెంబ్లీ స్ధానాల అంచనా నిజమవుతుంది.
ఒకవేళ చిరంజీవి చెబుతున్నట్టు నిశ్శబ్ద విప్లవం పని చేసి ఉంటే ప్రజారాజ్యం పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినన్ని అంటే 150 అసెంబ్లీ స్ధానాలు రావాలి. కానీ ఆ పరిస్ధితి కన్పించడం లేదు. కాంగ్రెస్ కు 30 ప్లస్, తెలుగుదేశం పార్టీకి 30 ప్లస్ శాతం ఓటు బ్యాంకు ఉంది. రెండు మూడు శాతం ఓట్లు అటూ ఇటూ మారడం వల్ల ఎంతో మార్పు వచ్చి అధికార పార్టీలు ప్రతిపక్షానికి వచ్చిన సందర్భాలు అనేకం. తక్కువలో తక్కువ కాంగ్రెస్, టిడిపి లకు 55 శాతం ఓటు బ్యాంకు ఉందనుకుంటే, మిగితా 20 శాతం ఓట్లను ప్రజారాజ్యం, బిజెపి, లోక్ సత్తా, ఇండిపెండెంట్లు పంచుకోవాలి. కొన్ని స్ధానాల్లో ప్రజారాజ్యం టాప్ లో ఉండవచ్చు. అక్కడ ఈ ఈక్వేషన్ పనిచేయదు. కానీ మెజారిటీ స్ధానాల్లో ఇది పనిచేస్తుంది. బిజెపి, లోక్ సత్తా, ఇండిపెండెంట్లు 5 శాతం ఓట్లు లాక్కున్నా ప్రజారాజ్యానికి వచ్చేవి 15 ప్లస్ శాతం ఓట్లు.
ప్రజారాజ్యం పార్టీ వల్ల ఎవరి ఓట్లలో ఎక్కువ చీలిక వచ్చిందో ఇప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. చిరంజీవి పార్టీ చీలుకున్న ఓట్ల ప్రభావంతోనే కాంగ్రెస్ కానీ మహా కూటమి గానీ అధికారంలోకి రావాలి. యాభై అరవై సీట్లు వచ్చినా రాష్ట్ర రాజకీయాలను శాసించాలని, ఐదారు లోక్ సభ స్ధానాలు వచ్చినా కేంద్రంలో ప్రభావం చూపాలని ప్రజారాజ్యం పార్టీ ఆశిస్తోంది.












Click it and Unblock the Notifications