Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'బాబా?-- బాబోయ్'

Chandrababu Naidu
హైదరాబాద్: చంద్రబాబు నాయుడికి గోప్యత ఎక్కువ. ఆయన మనసులో ఉన్నది చెప్పరు. నాయకుడికి గోప్యత అవసరమే కానీ అన్ని సందర్భాల్లో కాదు. నాయకుడు అప్పుడప్పుడైనా మనసు విప్పి మాట్లాడితే సామాన్య ప్రజలు ఆనందిస్తారు. నాయకుడు అతి గోప్యం ప్రదర్శిస్తే అతనిమీద జిత్తులమారి అన్న ముద్రపడిపోతుంది. చిరంజీవి ఈ విషయంలో చంద్రబాబుకు చురకవేసి, వైఎస్ ను మెచ్చుకున్నారు ఒక ఇంటర్వ్యూలో. వైఎస్ ఎన్ని తెరచాటు పనులు చేసినా, ఎన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా కొన్ని విషయాలని ఆయన బోళాగా చెప్పేయడం జనానికి నచ్చే అంశం.

చంద్రబాబు నాయుడు ఇటీవల ఐరోపా దేశాల పర్యటనకు వెళ్ళారు. ఆ పర్యటన వివరాలను ఆయన అత్యంత గోప్యంగా ఉంచేసరికి ఆయన గ్యారంటీగా స్విట్జర్లాండ్ వెళ్ళి తన రహస్య బ్యాంకు ఖాతాలను సరిచూసుకోబోతున్నారని, ఎన్నికల ఖర్చు పోను మిగిలిన నల్లధనాన్ని అక్కడికి తరలించి, పనిలో పనిగా వేసవి సెలవులను అక్కడే ఎంజాయ్ చేస్తున్నారని ప్రతిపక్షనాయకులు జనాంతికంగా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు భద్రతా కారణాల వల్లనే ఇలా చేయవలసి వస్తోందని తెలుగుదేశం నాయకులు చెబుతున్నా సామాన్యులకు అది నమ్మ శక్యంగా లేదు.

చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వంపై మరో ప్రధాన విమర్శ వాడుకుని వదిలేస్తారని. ఆయన గతంలో కమ్యూనిస్టులను, బిజెపిని అవసరానికి చేరువ చేసుకుని తర్వాత దూరంగా పెట్టడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు టీఅర్ ఎస్ కేసీఅర్ కు అదే ఫికర్ పట్టుకుంది. చంద్రబాబు చెప్పిన మాటకు కట్టుబడి ఉండరని, ఆయనది అవకాశవాద, స్వార్ధ విధానమని మరో విమర్శ. ఈ నేపధ్యంలో ఆయన నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తారా? అన్న సంశయం సగటు మహిళల్లో ఉన్నట్టు కన్పించింది. అయినా అనుమానంతోనే వారిలో ఒక భాగం చంద్రబాబు పార్టీకి ఓటేసినట్టు తెలుస్తోంది. చంద్రబాబు వ్యక్తిత్వంలో ఆ విశ్వసనీయత ఉంటే నగదు బదిలీ, ఉచిత కలర్ టీవీ పథకాలకు ఓట్లు కుంభవృష్టిలా పడి కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయేది. ఇన్ని అవినీతి ఆరోపణలు ఉన్నా కనీసం 100కు పైగా స్ధానాల్లో కాంగ్రెస్ ఖచ్చితమైన విజయం సాధించబోవడానికి కారణం ఈ క్రెడిబులిటీ పాయింటే. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, వృధాప్యపు పించన్లు, మహిళలకు పావలా వడ్డీకే రుణాలు, ఆరోగ్యశ్రీ వంటి వైఎస్ పథకాలు జనంలోకి చొచ్చుకుపోయాయి. వైఎస్ పైన కొన్ని వేలకోట్ల అక్రమార్జన ఆరోపణలు ఉన్నప్పటికీ జనం వాటిని పెద్దగా పట్టించుకున్నట్టు కన్పించదు.

మహాకూటమి అధికారంలోకి వస్తే నగదు బదిలీ, ఉచిత కలర్ టీవీల పథకాలకు ఆయన కొత్త ట్విస్ట్ లు, కొత్త షరతులు పెడతారని సీనియర్ అధికారులే ఒప్పుకుంటున్నారు. గతంలో పనికి ఆహారం పథకాన్ని ఆయన పచ్చచొక్కాల ఆహారపథకంగా మార్చేసి, టిడీపి నాయకులని నయాధనికులుగా మార్చేశారు. ఆ పథకం ఫలితాలు అందాల్సిన పేదలు ఆకలితో అలమటించిపోయారు. ఆ ప్రభావం 2004 ఎన్నికల్లో కన్పించి, తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయం పాలు కావలసి వచ్చింది. చంద్రబాబు నాయుడు గ్రామాలను, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారన్న అభిప్రాయం, కసి కొన్ని వర్గాల ప్రజల్లో ఇప్పటికీ ఉంది. వారు "బాబా! బాబోయ్" అనుకుంటూ ఉండవచ్చు.

చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జనం మైండ్ సెట్ మారాలని అనేవారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆయన అటువంటి ఎక్స్ ట్రా మాటలు మాట్లాడడం లేదు. ఇప్పుడాయన టార్గెట్ ఒక్కటే ఎలాగైనా అధికారంలోకి రావాలని. ఇన్ని మిత్రపక్షాలను కలుపున్నా, నందమూరి హీరోలతో ప్రచారం చేయించుకున్నా, ఆకర్షణీయమైన సంక్షేమపథకాలను మేనిఫెస్టోలో చేర్చుకున్నా, చంద్రబాబు ఇంకా అత్తెసరు (అంచనాల ప్రకారం) మెజారిటీ వద్ద మిగిలిపోయే పరిస్ధితి ఉందంటే, ఆయనలో ఎన్ని నెగిటివ్ పాయింట్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. కూటమికి ఇన్ని అంశాలు కలిసివచ్చినప్పుడు 230 స్ధానాల వరకు దూసుకెళ్ళాలి. కానీ అలా ఎందుకు జరగడం లేదు? చంద్రబాబు మైండ్ సెట్ మారాలి. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పెంపొందించాలి. డబ్బున్న వారికే, బడావ్యాపారులకే టిడిపి టికెట్లు ఎక్కువగా ఇస్తారన్న అపప్రదను పోగొట్టుకోవాలి. అన్నిటికీ మించి ఇతను మన మనిషి అన్న అభిప్రాయం జనంలో కలగాలి. అందుకోసం ఆయన నిపుణుల నుంచి శిక్షణ తీసుకోవాలి. తన ప్రసంగాలు ఉప్పూ కారం లేనట్టుగా ఉంటాయి. అవసరాన్ని బట్టి నవ్వుతూ పిట్టకథలు, సామెతలు చెప్పాలి. సామాన్య జనానికి అర్ధమయ్యేలా ప్రసంగించాలి. గెలిచినా ఓడినా ఆయనలో ఈ మార్పులు వస్తే బాగుంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+