వైయస్ జగన్ కు వ్యతిరేకంగా రంగంలోకి 'దేశ ముదుర్లు'

కాంగ్రెసు హై కమాండ్ దింపుతున్న కేశవరావు, హనుమంతరావు తెలంగాణకు చెందిన మున్నూరు కాపులు. వీళ్ళు బీసీలు. వీళ్ళు హైదరాబాద్ ముదుర్లు కారు. ఢిల్లీ లాబీయింగ్ ద్వారా 'దేశముదుళ్ళు" అయ్యారు. బొత్స సత్యనారాయణ కూడా బీసీ కాపే. వీళ్ళకు ఉభయగోదావరి జిల్లాలో ఫాలోయింగ్ ఏమాత్రం లేదు. సోనియాగాంధీకి, ఇతర హై కమాండ్ నేతలకు రాష్ట్రంలో సామాజిక వర్గాలు, కులాలపైన అవగాహన లేదనడానికి ఇది చక్కటి ఉదాహరణ. కేశవరావు, హనుమంతరావులు ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడితే వార్డు మెంబర్లుగా కూడా గెలిచే అవకాశముండదు. అధినేత్రిని కాకాపట్టుకుని వాళ్ళు కాలం వెళ్ళదీసుకుంటున్నారు. ఒక్క బొత్స సత్యనారాయణకు మాత్రం ఉత్తరాంధ్రలో పలుకుబడి ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో అతని పప్పులు ఉడకవు.
ముఖ్యమంత్రి రోశయ్యకు మాత్రం ఈ కులాల వ్యవహారం బాగా తెలుసు. కానీ ఆయన ఇప్పుడు హైకమాండ్ ముందు నోరెత్తే పరిస్ధితి లేదు. అమ్మగారు చెప్పినట్టు చేసుకుంటూ పోవడమే ఆయన పని. జగన్ జగమొండిగా మారడంతో ఆ భయానికి రోశయ్య పూర్తిగా హైకమాండ్ ముందు దాసోహమంటున్నారు. జగన్ కోసం తూర్పు గోదావరి జిల్లాలో జన సమీకరణ బాగా జరిగింది. ధనబలం, వైఎస్ పై అభిమానమున్న మండల స్ధాయి నాయకుల వల్ల ఇది సాధ్యమైంది. జగన్ అన్ని జిల్లాల్లోనూ ఇదే విధంగా పర్యటించాలని యోచిస్తున్నట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications