కెసిఆర్ తలించిందొకటి, జరిగేది..

ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ను ఏర్పాటు చేయడం కెసిఆర్ కు పెద్ద తలనొప్పిగా తయారేంది. తానే కేంద్రంగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని భావించిన కెసిఆర్ కు ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ అంతా తన వెంట ఉంటుందన్న ఆయన విశ్వాసంపై వేటు పడింది. తన ఫ్రంట్ రాజకీయ శక్తిగా ఎదుగుతుందని, గ్రామస్థాయి నుంచి ఫ్రంట్ ను బలోపేతం చేస్తామని గద్దర్ అంటున్నారు. ఇది కచ్చితంగా తెరాసకు నష్టం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా, గద్దర్ కు మీడియా సహకారం దండిగా లభిస్తోంది. తమ ఆధిపత్యంలోని మీడియాను ప్రశ్నించడానికి ఒడిగట్టిన కెసిఆర్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు సీమాంధ్ర మీడియాకు గద్దర్ ప్రజా ఫ్రంట్ మంచి అవకాశాన్నే కలిగించిందని చెప్పాలి. ఇప్పటికే కెసిఆర్ కు వ్యతిరేకంగా గద్దర్ ను చూపిస్తూ మీడియా వార్తకథనాలను పండిస్తోంది.
ఇదిలా ఉంటే, తెరాసపై తెలంగాణ అమరవీరుల కుటుంబాలు తిరుగుబాటుకు పూనుకున్నాయి. తెలంగాణ అమరవీరుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం తెరాస కార్యాలయం తెలంగాణ భవన్ ముందు తెలంగాణ అమరవీరుల కుటుంబాలవారు ధర్నాకు దిగారు. తెరాస ఇచ్చిన చెక్కులు చెల్లలేదంటూ వారు ఆందోళనకు దిగారు. తమను తెరాస పట్టించుకోవడం లేదని ఆరోపించారు. శనివారం కూడా వారు ధర్నాకు దిగారు. తెలంగాణ కోసం మరణించిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ తెరాస నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో తెరాస కొంత మేరకు ఆత్మరక్షణలో పడినట్లే. తెరాస నాయకుడు సుమన్ తెలంగాణ అమర వీరుల ఐక్య వేదిక నాయకుడు రఘుమారెడ్డిపై చేయి చేసుకోవడం సమస్యలో మరో సమస్యగా ముందుకు వచ్చింది. డిసెంబర్ తర్వాత భూకంపం పుట్టించాలనే కెసిఆర్ ప్రయత్నాలకు గండి కొట్టే చర్యలు వ్యతిరేక శక్తులు ఇప్పటి నుంచే రంగంలోకి దిగాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications