జగన్ అన్ని మరణాలు పట్టవా?

రాష్ట్రంలో అప్పులపాలై, పంటలు పండక తెలంగాణలోనే కాకుండా సీమాంధ్రలోనూ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ మరణాలు వందల సంఖ్యలో ఉన్నాయి. అలాగే, ఉపాధి కోల్పోయి చేనేత కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. చేనేత కార్మికులు, రైతుల ఆకలి చావులు కూడా సంభవించాయి. ఈ మరణాలు సంభవించడంలో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ విధానాల పాత్ర కూడా ఉంది. ఆ మరణాలను వైయస్ ప్రభుత్వం తక్కువ చేసి చూపే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా వారిని ఆదుకుంటామని చేసిన ప్రభుత్వాల హామీలు అమలు కావడం లేదు. ఈ మరణాలు మరణాలు కావా, వారి జీవితాలు జీవితాలు కావా అని జగన్ ను ప్రశ్నించే పరిస్థితి సొంత కాంగ్రెసు పార్టీలోనూ తలెత్తవచ్చు. తన తండ్రి మరణానికి షాక్ కు గురై మరణించినవారిని మాత్రమే పట్టించుకోవడం ద్వారా జగన్ ఓదార్పు యాత్ర సంకుచితమవుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.
తెలంగాణలో యువకులు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న వైనంపై వైయస్ జగన్ ఇప్పటికే ప్రశ్నలు ఎదుర్కుంటున్నారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను పరామర్శించి ఆ విమర్సను ఎదుర్కోవడానికి జగన్ వర్గానికి చెందిన కొండా సురేఖ ప్రయత్నించారు. అయితే, ఆమె ఓదార్పును తెలంగాణ కుటుంబాలు తిరస్కరించాయి. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు ఇప్పటికే జగన్ ను ప్రశ్నిస్తున్నారు. ఈ ఆత్మహత్యలను పట్టించుకోని జగన్ రాష్ట్ర నాయకుడు ఎలా అవుతారు, అందరివాడు ఎలా అవుతారనేది ప్రశ్న. తన కుటుంబం, తన ఆస్తులు, తన రాజకీయం, తన అధికారం, తన వ్యాపారాలు తప్ప తనవారి శ్రేయస్సు తప్ప మిగతా వారు జగన్ పట్టడం లేదు. అందరి శ్రేయస్సు కోరే నాయకుడు మాత్రమే ప్రజానాయకుడవుతారు, అందరివాడు అవుతాడనే ప్రధానమైన విషయాన్ని జగన్ విస్మరిస్తున్నారు. దీని ప్రభావం ఇప్పుడు కనిపించకపోవచ్చు గానీ దీర్ఘకాలంలో ఆయనపై ఈ ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications