జగన్ తర్వాత కెవిపి టార్గెట్?

వైయస్ జగన్ బ్లాక్ మెయిల్ పద్ధతి అధిష్టానానికి కూడా నచ్చకపోవడం కాంగ్రెసులోని ఆయన ప్రత్యర్థులకు అవకాశంగా దొరికింది. ఇదే సమయంలో కెవిపిని కూడా ఇరకాటంలో పెట్టడానికి పలు మార్లు ప్రయత్నించారు. కెవిపి రామచందర్ రావు వైయస్ జగన్ ను వ్యతిరేకిస్తూ కాంగ్రెసు పట్ల నమ్మకంతో వ్యవహరిస్తారని కూడా ఆ నాయకులు విశ్వసించడం లేదు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ వ్యక్తం చేసిన అభిప్రాయం ఆ విషయాన్ని బలపరుస్తోంది. వైయస్ జగన్ కు సాయం చేయడానికి మాత్రమే కెవిపి కాంగ్రెసులో ఉన్నారని, వైయస్ రాజకీయాలకు ఉపయోగపడే విధంగా చేసిన వ్యూహరచనలో భాగంగానే కెవిపిని విమర్సిస్తూ కొండా సురేఖ బహిరంగ లేఖ రాశారని ఆయన అన్నారు. విహెచ్ వ్యాఖ్యలు పూర్తిగా ఆ విషయాన్ని చెప్పకపోయినా ఆ కంఠస్వరం మాత్రం వినిపించింది.
కొండా సురేఖ రాసిన బహిరంగ లేఖను వాడుకుని కెవిపిని ఆత్మరక్షణలో పడేయాలనేది కాంగ్రెసులోని వైయస్సార్ వ్యతిరేకుల ఎత్తుగడగా కనిపిస్తోంది. ఇంత వరకు ఏదీ తనకు అంటుకోలేదనే పద్ధతిలో వ్యవహరిస్తున్న కెవిపి కూడా బజారులో పడాల్సిన పరిస్థితి వచ్చింది. అలా చేయడమే ప్రత్యర్థుల ప్రధాన కర్తవ్యంగా తోస్తోంది. కెవిపి ఎంత నమ్మకంగా వ్యవహరించినా, వ్యవహరించడానికి ప్రయత్నించినా కాంగ్రెసు అధిష్టానం ఆయనను పూర్తిగా వెనకేసుకుని రావడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. ఆయనను బలహీనపరచడం కూడా అధిష్టానం ఎత్తుగడగా ఉండవచ్చు. పలువురు పార్టీ శాసనసభ్యులు, మంత్రులు ఇప్పటికీ కెవిపి మాట వింటారనే అభిప్రాయం బలంగా ఉంది. మంత్రులను, శాసనసభ్యులను కెవిపికి దూరం చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవచ్చు. ఇప్పటికి చాలా మంది వైయస్ జగన్ కు దూరమైనప్పటికీ కెవిపికి దూరం చేయడం ద్వారా మాత్రమే పూర్తిగా ఫలితం సాధించవచ్చుననేది కాంగ్రెసు అధిష్టానం ఉద్దేశ్యమని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications