పీఠం కోసం ఎత్తుకు పైఎత్తులు!

రాష్ట్ర పార్టీలో పాతుకుపోయేందుకు చిరంజీవి ఇప్పటినుంచే ముఖ్యమంత్రికి చెక్ పెట్టే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్లు ఆయన చర్యలు చెప్పకనే చెబుతున్నాయి. అందులో భాగంగా, ముఖ్యమంత్రికి ప్రత్యర్థిగా భావిస్తోన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చిరంజీవి మూడు రోజుల క్రితం తిరుపతి వెళ్లినప్పుడు భేటీ కావడం చర్చనీయాంశమయింది. ముఖ్యమంత్రితో పెద్దిరెడ్డికి సరిపడటం లేదని, కిరణ్‌ను దింపేవరకూ తాను పోరాడతానని పెద్దిరెడ్డి బాహాటంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది తెలిసి కూడా చిరంజీవి ఆయనను కలిసారంటే చిరు ఓ వ్యూహం ప్రకారమే వెళుతున్నారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ భేటీలో ఇరువురి పదవులపై చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. జిల్లాలో పట్టు పెంచుకునే దిశలో పెద్దిరెడ్డిని చిరంజీవి అప్రమత్తం చేసినట్లుగా తెలుస్తోంది.
ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ముఖ్యమంత్రికి చెక్ పెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. తనకు పిసిసి అధ్యక్ష పదవి లభించే ఒకరోజు ముందు బొత్స పెద్దిరెడ్డితో భేటీ అయ్యారు. పిసిసి అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత బొత్స ప్రభుత్వం, పార్టీ వేరు కాదని చెప్పారు. ప్రభుత్వం కూడా పార్టీలో అంతర్భాగమని, తనకూ సిఎం కావాలని బహిరంగంగానే చెప్పారు. చిరు కూడా తనకు పోటీ కాదని చెప్పారు. ఎవరికి సత్తా ఉంటే వారు ఎదుగుతారని చెప్పారు. కానీ పీఠం కోసం తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది. దీన్ని బట్టి కిరణ్‌తో పోరుకు బొత్స సిద్ధంగానే ఉన్నారన్న సంకేతాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే తనకు వ్యతిరేకంగా బొత్స, చిరు చేస్తున్న ప్రయత్నాలను గ్రహించిన కిరణ్ కుమార్ రెడ్డి వారిద్దరికీ చెక్ పెట్టే వ్యూహానికి తెరలేపారు. కాపు సామాజిక వర్గంలో చిరంజీవిని వ్యతిరేకించే కేంద్రమాజీ మంత్రి దాసరి నారాయణరావును కిరణ్ వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకువచ్చారు.
చిరు ప్రయత్నాలు తెలిసిన వెంటనే శరవేగంగా స్పందించిన కిరణ్ అదేరోజు సాయంత్రమే దాసరి నివాసానికి వెళ్లి ఆయనతో అరగంటపాటుమంతనాలు సాగించారు. దాసరి, చిరుకు బద్ద వైరం ఉన్న విషయం తెలిసిందే. మీరు క్రియాశీల పాత్ర పోషించాలని, కాపులను సమన్వయం చేసే బాధ్యత స్వీకరించాలని దాసరిని అభ్యర్థించినట్లుగా తెలుస్తోంది. అంటే దాసరిని తెర పైకి తీసుకురావడం ద్వారా కాపు కార్డుతో తమ లక్ష్యసాధనకు చేరువకావాలని భావిస్తున్న సత్తి బాబు-చిరంజీవికి అదే కాపు కార్డుతో ఏకకాలంలో చెక్ పెట్టాలన్నది ముఖ్యమంత్రి ఎత్తుగడగా పలువురు భావిస్తున్నారు. దాసరిని తెరపైకి తీసుకువస్తే చిరంజీవి స్పీడ్ సహజంగానే తగ్గిపోతుంది. కాపు నేతలూ రెండుగా విడిపోతారు. అప్పుడు సహజంగానే చిరంజీవి బలహీనమవు తారన్న వ్యూహంతోనే సిఎం పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది.
ప్రసంగాల్లో చిరు కన్నా వాడి వేడిగా ఉండే దాసరిని ఇక పై ఎక్కువగా వినియోగించుకోవడం ద్వారా, చిరు దూకుడుకు చెక్ పెట్టాలన్నదే సిఎం అసలు వ్యూహంగా తెలుస్తోంది. బొత్స దూకుడుకు కళ్లెం వేసేందుకు ముఖ్యమంత్రి తన పాత వైఖరిని మార్చుకుని క్రియా శీలకంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు బొత్సను విమర్శించిన అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్‌తో కూడా సిఎం చర్చలు జరిపారు. చాలారోజుల వరకూ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో అంటీముట్టనట్లు వ్యవ హరించిన కిరణ్ ఇప్పుడు వీలయినంత ఎక్కువ సేపు వారితోనే గడుపుతున్నారు. మొత్తానికి చిరు, బొత్సకు వ్యతిరేకులైన దాసరి, హర్షకుమార్‌తో సిఎం, సిఎం వ్యతిరేకి పెద్దిరెడ్డితో చిరు, ప్రభుత్వం తనకు వేరు కాదని బొత్స ఇలా ముగ్గురు ఎవరికి వారు పీఠం కోసం పావులు కదుపుతున్నారు.












Click it and Unblock the Notifications