తెలంగాణ అంశం పక్కకు జరిగినట్టేనా?

సీమాంధ్రులు కూడా తెలంగాణ అంశం కన్నా అభివృద్ధిపైనే కమిటీ సభ్యులకు విన్నవించినట్టు వారి మాటల్లో అర్థమవుతోంది. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం కన్నా ప్రత్యేక ప్యాకేజీని అక్కడ కేటాయించడానికే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ నెల రాష్ట్రంలోని అన్ని పార్టీలతో హోంమంత్రి చిదంబరం ప్రత్యేక ప్యాకేజీపై యోచించే అవకాశాలు ఉన్నాయి.
అయితే తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెప్పుకుంటూనే మొదట ప్రత్యేక ప్యాకేజీపై దృష్టి పెట్టే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సీమాంధ్రలో మాజీ పార్లమెంటు సభ్యుడు జగన్, సమైక్యాంధ్ర అంటే తెలంగాణలో తెరాస కాంగ్రెస్ నాయకులను ముప్పుతిప్పలు పెట్టే అవకాశం ఉంది.
ఇరుప్రాంతాలలోని కాంగ్రెస్ నాయకులపై తెరాస, జగన్ వర్గం, తెదేపా రాజీనామాస్త్రాలు ప్రయోగించి వారి ఇమేజ్ డ్యామేజ్ చేస్తాయి. ప్రాంతాల కోసం వారు రాజీనామాలు చేయకపోతే స్థానికంగా వారు పూర్తిగా బలహీన పడిపోవడం ఖాయం. ఇప్పుడు వారి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా ఉంది. రాష్ట్రంలో పరిస్థితి దిగజారితే ఇప్పటికే కేంద్రంలో అష్టకష్టాల్లో పడిన కాంగ్రెస్ మరింత సమస్య ఎదురవుతుంది. ఈ కారణంగా మధ్యేమార్గాన్ని ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి.
ప్రత్యేక రాష్ట్రాన్ని సుప్తావస్థనలో పెట్టి కొంతకాలం తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం ద్వారా వారిలోని ఉద్వేగాలను చల్లార్చాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ వారికి రాజ్యాంగపరంగా, రాజకీయంగా తదితర అంశాల్లో ప్రత్యేక ప్రాధాన్య ఇచ్చిన అనంతరం కొంతకాలం వేచి చూసి ఆ తర్వాత తెలంగాణ ఇవ్వడమనే అంశాన్ని ఆలోచించే దిశలో పావులు కదిపే అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణను సుప్తావస్థనలో పెట్టడం ద్వారా జగన్ ను ఎదుర్కోవడానికి సమయం దొరకడం, ఇరుప్రాంతాల్లోని ప్రజల్లో కొంతమేర ఉద్వేగాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. అయితే తెలంగాణకోసం వచ్చిన పెద్దమనుషుల ఒప్పందం, 610 జివో, ముల్కీ నిబంధనలపై ప్రభుత్వాలు ఏ సమయంలోనూ నిబద్దతను పాటించలేదని, అందుకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తప్ప మరేదీ ఆమోదించేది లేదని తెలంగాణవాదులు అంటున్నారు.












Click it and Unblock the Notifications