కెసిఆర్ వైఖరి తెలంగాణకు నష్టమా?

తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశం ఈ నెల 6న ఏర్పాటు చేసుకున్నప్పటికీ అంతకు ముందుగానే వారితో కెసిఆర్ భేటీ కావడం, భాగస్వామ్య పక్షాల నిర్ణయం తెలుసుకోకుండానే 6వ తేది నుండి 7వ తేదికి మార్చడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు జెఎసి కార్యాచరణ కెసిఆర్ ప్రకటించడాన్ని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. జెఎసి పక్షాలుగా కెసిఆర్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావద్దని కోదండరాంకు తాము సూచించినప్పటికీ ఆయన హాజరు కావడం వారిని తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయంట. కెసిఆర్ ఇలా ఒంటెత్తు పోకడలకు పోవడం తరుచూ జరుగుతూనే ఉందని ఆరోపణలు చేసే వారు కూడా ఉన్నారు. జెఎసి నుండి టిడిపిని బహిష్కరించడం మొదలు అన్నీ ఆయన కనుసన్నుల్లోనే జరుగుతున్నట్లు పలువురు ఆరోపణలు చేస్తున్నారు. మిలియన్ మార్చ్ సందర్భంగా కెసిఆర్ అభిప్రాయంతో జెఎసిలోని ఇతర భాగస్వామ్య పక్షాలు విభేదించాయని అప్పటి నుండి జెఎసిని నిర్వీర్యం చేసే యత్నాలను కెసిఆర్ చేస్తున్నారని వారు భావిస్తున్నారు. మిలియన్ మార్చ తర్వాత జెఎసి స్వతంత్రంగా ముందుకెళ్లడం, దానికి స్పచ్చంధంగా ప్రజా స్పందన లభించడం, టిఆర్ఎస్ మినహా అన్ని భాగస్వామ్య పక్షాల విశ్వసనీయత పెరగడం కెసిఆర్‌కు కంటగింపుగా మారాయని అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా తెలంగాణలో తను, తన పార్టీ ప్రాధాన్యత తగ్గి జెఎసి ప్రాధాన్యత పెరగడంపై కెసిఆర్‌కు తీవ్ర అసంతృప్తి కలిగించినట్లుగా తెలుస్తోంది.
ఉద్యమం తన చేయి దాటి పోతుందని ఆయన ఆవేదన చెందుతుందని, జై తెలంగాణ అన్న ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ పోతే తన పరిస్థితి, తన పార్టీ పరిస్థితి ఏమిటనే మదనం కెసిఆర్‌లో కలిగినట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా జెఎసి తనను మించి ఎదగకుండా, మిగిలిన భాగస్వామ్య పక్షాలు టిఆర్ఎస్ మించి ఎదగకుండా జెఎసిని తన గుప్పిట్లో ఉంచుకుంటున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా వ్యూహాత్మకంగా జెఎసితో సంబంధాలు కొనసాగిస్తూ దానిని బలహీనపర్చే దిశలో ముందుకు వెళుతున్నట్లుగా తెలుస్తోంది. ఓ సమయంలో టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా రెడ్డి సామాజిక వర్గ నేతలను కోదండరాం కూడగడుతున్నారనే వార్తలు రావడంతో రాజకీయంగా అందరినీ ఒక్కటి చేయడంలో జెఎసి విఫలమైందనే విమర్శలు తీసుకు రావడం వెనుక కూడా కెసిఆర్ హస్తం ఉందనేది కొందరి వాదన. జెఎసిపై విమర్శలు చేయించి తాను ముందుకు వెళ్లాలనే యోచనలో కెసిఆర్ ఉన్నట్లుగా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే జెఎసికి అతీతంగా పలువురితో కెసిఆర్ భేటీ అవుతూ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. నాగం, జూపల్లి వంటి వారు తమ పార్టీలను ఎదిరించి కూడా తెలంగాణ గళం ఎత్తుకున్నప్పుడు కెసిఆర్ వారికి సరియైన మద్దతు ప్రకటించక పోవడం కారణంగా కెసిఆర్ తన చుట్టూనే ఉద్యమం తిప్పుకోవాలని చూస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాగా గత 2009 డిసెంబర్ తరహా ఉద్యమానికి కెసిఆర్ మరోసారి వ్యూహం రచిస్తున్నరని తెలుస్తోంది. అయితే ఈ ఉద్యమం తెలంగాణ సాధన కోసం అని భావిస్తే తప్పనే వారూ ఉన్నారు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఉద్యమాన్ని మరోసారి తీవ్రం చేయాలని టిఆర్ఎస్ భావిస్తోందంట. అయితే ఆ ఉద్యమం కేవలం తమ పార్టీ లాభం కోసమే అనే వారున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఆ ఎన్నికల్లో కాంగ్రెసు, టిడిపిలను దెబ్బ తీసి టిఆర్ఎస్ భారీ విజయం సాధించడంలో భాగంగా కెసిఆర్ ఈ రకం ఉద్యమానికి మరోసారి తెర తీస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కెసిఆర్ కారణంగా ఉద్యమం దెబ్బతిని తెలంగాణ జాప్యానికి కూడా కారణమవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications