జెఏసితో వద్దు, సొంతగానే?

అత్యధిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు తెలంగాణ కోసం సొంత కార్యక్రమంతో ముందుకు సాగాలన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సీమాంధ్ర నేతలు అనుసరిస్తున్న విధానాలను వారు ఉదహరిస్తున్నారట. 2009 డిసెంబర్ 9 ప్రకటన వెంటనే సీమాంధ్రలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలూ రాజీనామా చేసినా, మంత్రులు విధులు నిర్వర్తించిన విషయాన్ని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు గుర్తుచేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు ఖాయమని సంబరాలు చేసుకుంటున్న తరుణంలో సీమాంధ్ర నేతలు అధిష్ఠానంపై రాజకీయంగా ఒత్తిడి తేవడం వల్ల.. మొత్తం ప్రక్రియ ఆగిపోయిందని చెబుతున్నారు. ఆ తర్వాత కూడా సీమాంధ్ర నేతలు సమైక్య గళాన్ని వారి వారి పార్టీ వేదికల ద్వారానే వినిపిస్తున్నారని ఈ విషయంలో ఒక పార్టీ మరో పార్టీపై, ఒక నేత మరోనేతపై విమర్శలు, ప్రతివిమర్శలు చేయట్లేదని గుర్తుచేస్తున్నారు.
తెలంగాణలో ఇందుకు విరుద్ధంగా జరుగుతుండటంపై వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. సమైక్య గళాన్ని అధిష్ఠానానికి, కేంద్రానికి వినిపించే మొత్తం బాధ్యతను అక్కడి ఎంపీలు తీసుకుంటే ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా ఢిల్లీలో లాబీయింగ్‌ను విడిచిపెట్టి, పదవులకు రాజీనామా చేయాలంటూ తమపై ఒత్తిడి పెంచే కార్యక్రమం చేపట్టడం సరికాదనే ఉద్దేశ్యంతో ఉన్నారట. అధిష్ఠానంతో పరిచయాలు ఎక్కువున్న ఎంపీలు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తే రాష్ట్రసాధన సులువవుతుందని అభిప్రాయపడుతున్నారు. అధికార పక్షంలో ఉంటూనే ప్రతిపక్షాలతో నేరుగా మంతనాలు జరపడం, పార్టీ సొంత అజెండాతో తెలంగాణ సాధన కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించకపోవడం వంటి అంశాలను వారు ప్రశ్నిస్తున్నారట.












Click it and Unblock the Notifications