అబ్బాయ్ జగన్ వెంట బాబాయ్?

వాస్తవానికి, గత కొంత కాలంగా వివేకా వ్యవహార శైలిని సునిశితంగా గమనిస్తూ వస్తోన్న కాంగ్రెస్ నేతలు తాజా వ్యాఖ్యలపై పెద్దగా ఆశ్చర్యం వ్యక్తం చేయట్లేదని తెలుస్తోంది. వైఎస్‌పై అత్యంత ప్రేమాభిమానాలు కలిగిన వివేకా మంత్రిగా ఉన్నప్పుడే అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష సభ్యులపై విరుచుకుపడ్డారు. అప్పట్లో ఆవేశంతో ఊగిపోయినా.. తన వ్యవహారశైలి పట్ల ఆ తర్వాత క్షమాపణలు కోరారు. కానీ, శుక్రవారం ఆవేశంతో ఊగిపోతూ కాంగ్రెస్ పార్టీపైనా.. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణపైనా నిప్పులు చెరగడం వెనుక కారణమేముంటుందన్న సందేహాలు పార్టీ నేతల్లో నెలకొన్నాయి. కాగా.. ఇటీవల వివేకా బంధువు ఒకరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ద్వారా రాయబారం నెరిపినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.
ఆ బంధువు సదరు ఎమ్మెల్యే వద్దకు వెళ్లి ఇరు కుటుంబాల మధ్య కలహాలు సరికావని.. వివేకాతో సఖ్యతకు జగన్‌ను ఒప్పించాలని కోరారని సమాచారం. దీంతో, కృష్ణా జిల్లా ఓదార్పులో ఉన్న జగన్ దృష్టికి ఈ విషయాన్ని ఎమ్మెల్యే తీసుకెళ్లారని, బాబాయ్‌ను చేరదీసేందుకు తనకెలాంటి అభ్యంతరం లేకపోయినా.. అది తన ఒక్కడి వ్యవహారమే కాదని, కుటుంబ సభ్యులందరితోనూ సంప్రదించాల్సి ఉందని జగన్ స్పష్టం చేశారని సమాచారం. ఈ నేపథ్యంలోనే వివేకా సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారంటున్నారు. అలాగే, వైఎస్ బొమ్మ పెట్టుకుని ఓడిపోయిన వారి సంగతేమిటి? అంటూ పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను వివేకా పరోక్షంగా ఖండించారు.
వైఎస్‌ను గజదొంగగా చిత్రీకరిస్తే వైఎస్ అభిమాన శాసనసభ్యులను కూడగడతానని వివేకా వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇప్పటికే జగన్ వర్గంలో 26 మంది ఎమ్మెల్యేలుంటే వివేకా మరికొందరిని వెంట తీసుకువెళ్లే అవకాశం ఉందా? వెళితే ఎంతమంది వెళతారు? అనే సందేహాలను లేవనెత్తడం ద్వారా కాంగ్రెస్‌లో గందరగోళం సృష్టించడమే అసలు వ్యూహమనే అభిప్రాయం నెలకొంది. అంతేకాకుండా మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటి నుండి ఆయనకు ఎలాంటి పదవి రాలేదు. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తన నియోజకవర్గానికి నిధులు వైయస్ ఉన్నప్పటిలా రాకపోవడమూ ఆయనను అసంతృప్తికి గురి చేసి ఉంటుందని ఇలాంటి పలు కారణాల వల్ల ఆయన పార్టీని విడిచే అవకాశం ఉండవచ్చుననే పలువురు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications