వైయస్ జగన్ కట్టడికి ఆ'జాదూ'

రాష్ట్రంలోని 18 శాసనసభా స్థానాలకు, నెల్లూరు లోకసభ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో వైయస్ జగన్ హవాను నిరోధించడానికి తగిన ప్రణాళికను ఆజాద్ రూపొందించినట్లు చెబుతున్నారు. ప్రతి నియోజకవర్గానికి ఏడు లేదా ఎనిమిది మందితో ఓ సమన్వయ కమిటీని వేస్తారని అంటున్నారు. ఈ కమిటీలో జిల్లా మంత్రులను, పార్లమెంటు సభ్యులను, శాసనసభ్యులను, పిసిసి సభ్యులను, తదితరులను భాగస్వాములను చేస్తారు.
18 శాసనసభ నియోజకవర్గాలకు, లోకసభ సీటుకు వేసే ఈ కమిటీలు ఈ నెల 10, 14 తేదీల మధ్య ఐదు రోజుల పాటు ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. వారు స్థానిక కాంగ్రెసు కార్యకర్తలను, నాయకులను కలుస్తారు. ప్రతి నియోజకవర్గంలోని ముఖ్యమైన నాలుగైదు గ్రామాల్లో కూడా పర్యటించి కింది స్థాయి పరిస్థితిని తెలుసుకుంటారు. వారు ఉప ఎన్నికల్లో నిలబెట్టాల్సిన అభ్యర్థి పేరును కూడా సూచిస్తారు. ఈ 19 కమిటీలను సమన్వయం చేయడానికి రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేస్తారు.
ఆ కమిటీలు నియోజకవర్గాల్లో పర్యటించి, పార్టీ పరిస్థితిని పరిశీలించి ఇచ్చే నివేదికలను ఆజాద్ ఏప్రిల్ 17వ తేదీన అధ్యయనం చేస్తారు. వాటి ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేస్తారు. ఇటీవల 7 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని ఆజాద్ భావిస్తున్నారు. దానికి తోడు, పార్టీ నాయకులందరికీ బాధ్యతలను అప్పగించి, వారి సేవలను వినియోగించుకోవడానికి కూడా వీలవుతుందని ఆజాద్ భావిస్తున్నారు.
ఏడు శానససభా స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తమ పాత్ర లేకుండా చేశారని చాలా మంది సీనియర్ నాయకులు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమను దూరం పెడుతున్నారని వారు విమర్శించారు. తమను నిర్ణయాల్లో భాగస్వాములను చేయాలని కూడా వారు కిరణ్ కుమార్ రెడ్డికి, బొత్స సత్యనారాయణకు సూచించారు. కానీ అదేమీ జరగలేదు. ఈ స్థితిలో అందరినీ కలుపుకుని వెళ్లి సమన్వయం సాధించడమే కాకుండా వైయస్ జగన్‌ను కట్టడి చేయడానికి తన ప్రణాళిక పనికి వస్తుందని ఆజాద్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications