తెలంగాణ ఆశలపై నీళ్లు చల్లిన వైయస్ జగన్

తెలంగాణపై జగన్ మరింత స్పష్టత ఇచ్చి ఉంటే, తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన భూమిక రూపొంది ఉండేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన కొంత మంది నాయకులు అంటున్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి, తాము తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మరోసారి చెప్పినా తమకు ఎంతో బలాన్ని ఇచ్చి ఉండేదని వారంటున్నారు. ముగింపు ప్రసంగంలో జగన్ తెలంగాణ ప్రస్తావన చేయకపోవడం వల్ల తాము తెలంగాణవాదుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని అంటున్నారు.
ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక స్థానిక రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తన వార్తాకథనంలో ఇచ్చింది. దాని ప్రకారం తెలంగాణకు చెందిన రైతులు జగన్ ప్రసంగంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేసినట్లు ఆ వార్తాకథనాన్ని బట్టి అర్థమవుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు రైతులను మోసం చేశారని, జగన్ కూడా చంద్రబాబు దారి పట్టడనే నమ్మకం ఏమీ లేదని ఓ రైతు అన్నట్లు ఆ పత్రిక రాసింది. ఆర్మూర్‌కు సమీపంలోని ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి వైయస్సార్ కాంగ్రెసు నాయకులు వైయస్ జగన్ తుది రోజు ప్రసంగానికి పెద్ద యెత్తున యువకులను, మహిళలను బలవంతంగా తరలించారని ఆ పత్రిక రాసింది.
కాగా, వైయస్ జగన్ వెంట మొదటి నుంచీ నడుస్తున్న తెలంగాణకు చెందిన నాయకులు కొండా సురేఖ, బాజిరెడ్డి గోవర్దన్, రవీంద్ర నాయక్ వంటివారి వాదన మరో రకంగా ఉంది. తెలంగాణపై జగన్ మరో ప్రకటన చేయాల్సిన అవసరం ఏమీ లేదని వారంటున్నారు. ఏమైనా, జగన్ తన ముగింపు ప్రసంగంలో తెలంగాణ పేరు ఎత్తినా ఎంతో సంతోషంగా ఉండేదనేవారి సంఖ్యే ఎక్కువగా ఉంది.












Click it and Unblock the Notifications