కోదండరామ్‌పై గుర్రుమంటున్న కెసిఆర్

మహబూబ్‌నగర్ విషయంలో కోదండరామ్ మౌనంగా ఉన్నప్పటికీ స్థానిక జెఎసి నాయకులు బిజెపికి మద్దతిచ్చారు. ఇప్పుడు వరంగల్ జిల్లాలోని పరకాలలో కూడా అదే పరిస్థితి రానుంది. దీంతో తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ ఇరకాటంలో పడ్డారు. నిజానికి, మహబూబ్‌నగర్ సీటును తెలంగాణ జెఎసి ప్రతినిధికి ఆశించారు. కెసిఆర్ వారికి ఇవ్వకపోవడంతో కినుక వహించి బిజెపికి మద్దతు పలికినట్లు చెబుతున్నారు.
మహబూబ్‌నగర్‌లో సాధించిన విజయంతో పరకాలలో పోటీ చేసేందుకు బిజెపి రంగం సిద్ధం చేసుకుంది. ఇక్కడ కూడా మహబూబ్‌నగర్ పరిస్థితినే తెరాస ఎదుర్కోబోతున్నది. దీంతో తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ ఇరకాటంలో పడే పరిస్థితి వచ్చింది. బిజెపి జెఎసి నుంచి తప్పుకోకుండానే కెసిఆర్‌కు చెక్ పెట్టేందుకు సిద్ధపడింది. తమను జెఎసి నుంచి తప్పించలేని స్థితిని బిజెపి కోదండరామ్‌కు కల్పించింది. బిజెపిని కాదని తెరాసకు జెఎసి మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే కెసిఆర్‌కు కోదండరామ్ తొత్తుగా మారారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో కోదండరామ్ స్థితి ఇబ్బందికరంగా మారింది.
బిజెపిని విమర్శించడానికి కెసిఆర్‌కు కూడా కారణమేదీ దొరికడం లేదు. పరకాలలో బిజెపి పోటీ చేస్తే కెసిఆర్ మరింత ఇబ్బందుల్లో పడే పరిస్థితి రావచ్చు. బిజెపికి కాకుండా జెఎసి మద్దతు తనకు లభించేలా కెసిఆర్ ఎలా చేసుకుంటారనేది చెప్పలేని స్థితి. జెఎసిని ఒక్కతాటిపైకి తెచ్చి, తమ మాట వినేలా, తమకు మద్దతు ఇచ్చేలా చూడడంలో కోదండరామ్ విఫలమయ్యారని కెసిఆర్ భావిస్తున్నారు.
ప్రస్తుతం కెసిఆర్ తన ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. పోటీకి దించవద్దని బిజెపిని అడిగేందుకు కెసిఆర్ మార్గం కనిపించడం లేదు. పైగా, తెలంగాణకు అనుకూలంగా బిజెపి పెద్ద యెత్తున ప్రచారం సాగిస్తోంది.












Click it and Unblock the Notifications