గిల్ట్ నగలనుండి 10జనపథ్‌కు: ప్రియాంకతో పెళ్లే..

Robert Vadra - Priyanka Gandhi
న్యూఢిల్లీ: రాబర్ట్ వాద్రా ఇప్పుడు దేశం మొత్తం అందరి నోళ్లలో నానుతున్న పేరు! ఇతను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీని ప్రేమించడం, పెళ్లాడటం అంతా ఆసక్తికరమేనట. ఢిల్లీకి 145 కిలోమీటర్ల దూరంలోని మొరాదాబాద్‌లో వాద్రా కుటుంబం ఇత్తడి వస్తువులు, గిల్టు నగల వ్యాపారం చేసేది. ఎగువ మధ్య తరగతి స్థాయికి చేరుకోవడానికే ఆ కుటుంబానికి ఇరవై ఏళ్లకు పైగా పట్టింది. వాద్రా, ప్రియాంకల పరిచయం, పెళ్లే ఓ ఆసక్తికర అంశం. రాబర్ట్ వాద్రాకు మిషెల్ అనే చెల్లెలు ఉండేది. ఆమె... ప్రియాంకా గాంధీ స్నేహితురాలు. ఇద్దరూ కలిసి విందులు, వినోదాలకు హాజరయ్యేవారు.

కాలక్రమంలో ప్రియాంకతో వాద్రాకు పరిచయం ఏర్పడింది. సందర్భాన్ని బట్టి ఆమెకు కృత్రిమ ఆభరణాలను కానుకగా ఇచ్చేవారు. కొన్నాళ్లకు ఇద్దరి మనసులు కలిశాయి. మొదట్లో మిషెల్ కోసం మొరాదాబాద్ వెళ్లే ప్రియాంక... ఆ తర్వాత వాద్రా కోసం వెళ్లడం ప్రారంభమైంది. ఇది ఓ విలేకరి కంటపడింది. ఆయన వాద్రా తండ్రి రాజేంద్ర వాద్రాను కలుసుకుని వివరాలు సేకరించాడు. ప్రియాంక తన కుమారుడిని కలుసుకోవడానికి వస్తున్నట్టు ఆయన చెప్పారు. వారిద్దరూ మంచి స్నేహితులని కూడా చెప్పారు. ఆ విశేషాలు తొలిసారి అప్పుడే బయటపడ్డాయి.

ప్రియాంక, వాద్రాల పరిచయం ప్రేమగా, ప్రేమ పెళ్లిగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. 1997లో వారిద్దరికీ సోనియా నివాసంలోనే నిరాడంబరంగానే వివాహం జరిగింది. వాద్రా తండ్రికి ఈ పెళ్లి ఇష్టం లేదు. చివరి నిమిషం వరకూ ఆయన అభ్యంతరం చెప్పినప్పటికీ పెళ్లి జరిగింది. సోనియా అల్లుడిగా తన వల్ల వివాదాలు తలెత్తరాదనే వాద్రా చాలాకాలం ఎవరి కంట్లో పడకుండా ఉండేవారు. ఎక్కడా ఎటువంటి సమస్యలూ సృష్టించకూడదన్న సోనియా ఉద్దేశాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని మసలుకున్నారు.

అల్లుడిపై సోనియా ఉంచుకున్న నమ్మకం ఐదేళ్లలోనే వమ్ము అయ్యింది. 2002లో మొదటి వివాదం వెలుగు చూసింది. అది... రాబర్ట్ తండ్రి రాజేంద్ర వాద్రా, తమ్ముడు రిచర్డ్ వాద్రా రూపంలో. అప్పట్లో... రాజేంద్ర, రిచర్డ్ కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌ను కలుసుకున్నారు. తమ వ్యాపారం విషయంలో ఏదో సహాయం కోరారని తెలిసింది. దేశ్‌ముఖ్ వెంటనే సోనియాకు ఫోన్ చేసి ఈ సమాచారం అందించారు. ఆమె వాద్రాకు ఫోన్ చేసి విషయం చెప్పారు.

తన తండ్రితో, తమ్ముడితోనూ ఎటువంటి సంబంధాలూ లేవని, తన పేరును ఉపయోగించుకోవడానికి తాను ఎవరికీ అనుమతినివ్వలేదని బహిరంగ నోటీసు ఇచ్చారు. సోనియా సూచనల మేరకే రాబర్ట్ వాద్రా ఈ నోటీసు ఇచ్చినట్లు చెబుతారు. వాద్రా తన వ్యాపార విషయాల్లో మరీ దూకుడుగా వ్యవహరించకుండా చూసేందుకు సోనియా, ప్రియాంక చాలాకాలం ప్రయత్నించారని చెబుతారు. వాద్రా తన పలుకుబడి పెంచుకుంటున్న తీరు, ఆయన నెట్‌వర్క్, వ్యాపారాల విస్తరణ, జీవనశైలిలో వస్తున్న భారీ మార్పులు వారిని ఆందోళనకు గురిచేయడం ప్రారంభించాయి.

ఆయన మీద ఎటువంటి వివాదాస్పద కథనాలూ రాకుండా చర్యలు తీసుకుంటూనే వచ్చారు. కానీ, అరవింద్ కేజ్రీవాల్ హఠాత్తుగా వాద్రాను రచ్చకీడ్చడం వారిని ఇరకాటంలో పెట్టింది. మరో విశేషమేమిటంటే, యూపి ఎన్నికల సమయంలో అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల్లో ప్రియాంకతో పాటు పర్యటించిన వాద్రా... తనకూ రాజకీయాల్లోకి రావాలనుందని ప్రకటించారు. ప్రియాంక ఆ వార్తను ఖండించారు. కానీ, వాద్రా మళ్లీ అదేమాట మరోసారి చెప్పారు. వాద్రాకు బ్రేకులు వేయడానికి తర్వాత సోనియా, ప్రియాంక చాలా శ్రమ పడ్డారట.

ప్రస్తుతం రాబర్ట్ వాద్రా ఆస్తుల విలువ రూ. 11,000 కోట్లకు పైమాటేనని సెలెబ్రిటీ నెట్ వర్త్ అనే వెబ్‌సైట్ తాజాగా వెల్లడించింది. ఆస్తి 300 కోట్లయినా, 11,000 కోట్లయినా ఆయన ఇంత సంపద కూడగట్టుకోవడానికి తప్పకుండా సోనియా కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకునే ఉంటారని అది తెలిపింది. వాద్రా కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. ఆయన చెల్లెలు, తండ్రి, తమ్ముడు.. ముగ్గురూ వేర్వేరు కారణాలతో దుర్మరణం పాలయ్యారు. చెల్లెలు మిషెల్ 2001లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. రెండేళ్లకే... తమ్ముడు రిచర్డ్ మేడపై నుంచి పడిపోయి మరణించారు. తండ్రి రాజేంద్ర వాద్రా ఇటీవలే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి.

మొత్తానికి... ఈ మరణాలు ఓ మిస్టరీగా మారాయి. వాద్రా తల్లి మౌరీన్ ఆంగ్లో ఇండియన్. వాద్రాకు తన తల్లి పట్ల విపరీతమైన అభిమానం. వాద్రా నెలకొల్పిన 'స్కై లైట్ హాస్పిటాలిటీ'లో మౌరీన్ కూడా ఒక డైరెక్టర్. ఆమె వాద్రాతోనే కలిసి ఉంటారు. వాద్రా శరీర ధారుడ్యానికి, సౌష్టవానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. స్టైల్‌గా ఉండే దుస్తులు ధరించడం, వాహనాలను వేగంగా నడపడం ఆయనకు ఇష్టమైన వ్యాపకాలు. రాహుల్ గాంధీకి కూడా వేగమంటే ఇష్టం. బావా, బావమరిదిని ఈ అలవాటు మరింత దగ్గర చేసింది. ఇద్దరూ కలిసి ల్యూటెన్స్ ఢిల్లీలో హైస్పీడులో వాహనాలు నడుపుతుంటారని చెబుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+