వైయస్ జగన్‌కు కౌంటర్: బైబిల్ సెంటిమెంట్

ఢిల్లీలో జగన్ , ఆ తర్వాత రాష్టప్రతి ఎన్నికల ముందు ఢిల్లీకి వెళ్లిన ఆయన తల్లి విజయలక్ష్మి ఎవరెవరిని కలిశారు? ఏమేమి ఒప్పందాలు చేసుకున్నారు? కాంగ్రెస్ నాయకులతో ఏమేమి హామీలు తీసుకున్నారో బైబిల్ మీద ఒట్టేసి చెప్పాలని వారు డిమాండ్ చేశారు.. జగన్ ఓదార్పు యాత్రతో పాటు, విజయమ్మ కార్యక్రమాలకు క్రైస్తవ నేతలే అన్ని ఏర్పాట్లు చేస్తూ, క్రైస్తవులను ఓటుబ్యాంకుగా మార్చుకుంటున్న వైనాన్ని గ్రహించిన తెలుగుదేశం పార్టీ అదే సెంటిమెంట్ అస్త్రం సంధించి, జగన్ కుటుంబానికి బైబిల్ మీద, క్రైస్తవ మత విశ్వాసాల మీద ఏపాటి గౌరవం, నిజాయితీ ఉందన్న విషయాన్ని అదే క్రైస్తవులకు నిరూపించాలని నిర్ణయించింది.
నిజానికి ఎవరినీ కలవకపోతే జగన్ కుటుంబం బైబిల్ మీద ప్రమాణం చేసేందుకు ఎందుకు వెనుకంజ వేస్తుందన్న ప్రశ్నతో ఇరుకునపెట్టవచ్చని టిడిపి భావిస్తోంది. జగన్ కుటుంబం బైబిల్‌ను కూడా తమ రాజకీయాలకు వాడుకుంటుందన్న సరికొత్త ప్రచారంతో క్రైస్తవుల ముందుకు వెళ్లాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఆ మేరకు ఇదే వాదనను మైనారిటీ నేతల ద్వారా క్రైస్తవులకు వివరించేందుకు సిద్ధమవుతోంది.
‘విజయమ్మ ఎక్కడికి వెళ్లినా చేతిలో బైబిల్ తీసుకు వెళతారు. మంచిదే. అందరి విశ్వాలనూ గౌరవించాల్సిందే. కానీ అలాంటి పరమ పవిత్రమైన బైబిల్ మీద ప్రమాణం చేసి తాను గానీ, కొడుకు జగన్ గానీ, తమ పార్టీ నేతలు గానీ ఢిల్లీలో కాంగ్రెస్ నాయకత్వంతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని ఎందుకు చెప్పడం లేదు? తమ మధ్య బెయిల్, ఇతర ప్యాకేజీ ఒప్పందాలు జరగలేదని చెప్పవచ్చు కదా? మౌనంగా ఉంటూ దానిని ఖండించడం లేదంటే వాళ్లిద్దరూ, పార్టీ నేతలు కాంగ్రెస్ నేతలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని అంగీకరించడమే కదా? నిజంగా విజయమ్మ-జగన్‌కు క్రైస్తవులు పరమ పవిత్రంగా భావించే బైబిల్ మీద నిజాయితీ, నమ్మకం, విశ్వాసం, గౌరవం ఉంటే తాము కాంగ్రెస్ నేతలతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని ప్రమాణం చేసి తీరాలి' అని కొత్తకోట దయాకర్ రెడ్డి అన్నారు.
ఖండించకుండా, సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటే జగన్ జైలు నుంచి బయటకు వచ్చేందుకు కాంగ్రెస్‌తో బేరసారాలాడుతున్నారని, మతాన్ని రాజకీయ స్వార్థానికి వాడుకుంటున్నారని ప్రజలు కచ్చితంగా నమ్మవలసి వస్తుందని ఆయన అన్నారు. బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పాలని తాను సవాల్ చేసి ఒకరోజు గడిచినా ఇప్పటివరకూ జగన్ కుటుంబం నుంచి ఎలాంటి స్పందన లేదని, దీంతో జగన్ కుటుంబం కాంగ్రెస్‌తో ఒప్పందం చేసుకుందన్న విషయాన్ని క్రైస్తవులు గుర్తించాలని ఆయన అన్నారు.
ఢిల్లీలో తల్లీ కొడుకులు కాంగ్రెస్ నాయకత్వంతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పాలన్న తమ పార్టీ డిమాండ్‌పై దేశ, విదేశాల్లో క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న జగన్ బావ బ్రదర్ అనిల్ ఎందుకు స్పందించడం లేదని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రశ్నించారు. జగన్ కుటుంబం మతాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న మోసాన్ని క్రైస్తవులు గ్రహించాలన్నారు. తాము ఏమి చెప్పినా క్రైస్తవులు గుడ్డిగా నమ్ముతారని భావిస్తున్న జగన్ కుటుంబసభ్యులను.. కాంగ్రెస్‌తో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని బైబిల్‌పై ఒట్టువేసేలా క్రైస్తవ మత పెద్దలు ఒప్పించాలని రామయ్య కోరారు.












Click it and Unblock the Notifications