సారు వద్దు.. తమ్ముడు చాలు!: ఇదీ ఎర్రన్న
వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యుడు కింజారపు ఎర్రన్నాయుడు తెలుగుదేశం పార్టీకి కుడి భుజంగా, కేంద్రమంత్రిగా కూడా పని చేశారు. ఇలా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే నేతగా ఎర్రన్నాయుడు ముద్రపడ్డారు. ఎర్రన్నాయుడు మృతిని ఆయన స్వగ్రామం నిమ్మాడ, శ్రీకాకుళం జిల్లా, టిడిపి, ఇతర పార్టీలు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి.

తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు మృతిని నిమ్మాడ గ్రామస్తులు, శ్రీకాకుళం జిల్లా వాసులు, టిడిపితో పాటు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

ఆయన రాజకీయ నాయకుడిగా ఎదగకముందు తమ్ముడిగా, అన్నగా, కొడుకుగా ఇలా సంబంధాలతో పలకరించే వారమని, ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత సార్ అని పిలిస్తే వద్దనే వారని గుర్తు చేసుకుంటున్నారు.

ఎర్రన్నాయుడు తెలుగుదేశం పార్టీకి కుడి భుజంగా, కేంద్రమంత్రిగా కూడా పని చేశారు. ఇలా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే నేతగా ఎర్రన్నాయుడు ముద్రపడ్డారు.

పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో పాల్గొని పార్టీ కార్యకర్తలకు, నాయకులలో ఉత్సాహాన్ని నింపేవారు. కొత్త వారిని రాజకీయాల్లో ప్రోత్సహించేందుకు ఇష్టపడేవారు.

ఎర్రన్నాయుడు తన ముప్పయ్యేళ్ల రాజకీయాల్లో ఎక్కడా నోరు జారిన సందర్భాలు లేవని తెలుగుదేశం పార్టీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను, టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని తూర్పురబట్టే వారని, అయితే ఎక్కడా హద్దు మీరక పోయే వారు అని నేతలు ఆవేదన చెందుతున్నారు. పార్టీకి పెద్ద దిక్కు కోల్పోయామంటున్నారు.
ఆయన సహృదయాన్ని తలుచుకొని విషాదఛాయల్లో మునిగిపోయారు. ప్రధానంగా ఎర్రన్నాయుడు స్వగ్రామం నిమ్మాడ గ్రామం శోకసముద్రంలో మునిగిపోయింది. కన్నబిడ్డ చనిపోవడంతో ఎర్రన్నాయుడు తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ గ్రామానికి ఎంతో మంచి చేసిన, తమ బాగును కోరుకున్న ఎర్రన్నను కోల్పోయామని గ్రామ ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన మృతి విషయం తెలిసి తాము షాక్‌కు గురయ్యామని, ఇది తాము జీర్ణించుకోలేక పోతున్నామని చెబుతున్నారు.
ఆయన రాష్ట్రానికి, జిల్లాకే కాకుండా తమ గ్రామానికి ఎంతో చేశారని నిమ్మాడ గ్రామ ప్రజలు చెబుతున్నారు. తమ గ్రామం నుండి ఉన్నత స్థానంలో ఉన్న రాజకీయ నాయకుడిని కోల్పోయామంటున్నారు. కేంద్రమంత్రి స్థాయికి, తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్నప్పటికీ తమను అప్యాయంగా పలకరించే వారని చెబుతున్నారు. ఆయన రాజకీయ నాయకుడిగా ఎదగకముందు తమ్ముడిగా, అన్నగా, కొడుకుగా ఇలా సంబంధాలతో పలకరించే వారమని, ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత సార్ అని పిలిస్తే వద్దనే వారని గుర్తు చేసుకుంటున్నారు.
నేను మీతోనే పెరిగానని, నన్ను తమ్ముడిగా, అన్నగానే పిలవాలని ఆయన తమకు సూచించే వారని రోదిస్తున్నారు. ప్రజలతో నిత్యం మమేకమయ్యే వారని చెబుతున్నారు. పార్టీలో కూడా తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. పార్టీలో క్యాడర్‌ను ఎంకరేజ్ చేసేవారని కార్యకర్తలు, నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు మాట్లాడే సామర్థ్యం ఉన్నప్పటికీ పలు సందర్భాలలో కొత్త వారిని ప్రోత్సహించేందుకు తమచే మాట్లాడించే వారని అవనిగడ్డ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య చెప్పారు.
హైదరాబాద్ నుండి ఢిల్లీ స్థాయి వరకు ఎక్కడ ఏ పని పడినా దగ్గరుండి పని చేయించే వారిగా ముద్రపడ్డారు. ఎక్కడా స్వార్థం కోసం చూడకుండా పార్టీ కోసం, ప్రజల కోసమే పని చేశారని టిడిపి నేతలు ఆవేదనతో చెబుతున్నారు. అందరికీ తలలో నాలుకగా ఉండేవారన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు పైన అభిమానంతో 1982లో పార్టీలో చేరిన ఎర్రన్నాయుడు ఎప్పుడూ పార్టీకి విశ్వాసంగానే ఉన్నారు. పార్టీ కోసం, సొంత ప్రజల కోసం నిత్యం కృషి చేసే వారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications