బాబుకు చెక్: లెఫ్ట్‌తో వైయస్ జగన్ దోస్తీ?

ఇటీవలి ఉప ఎన్నికల్లో సిపిఎం స్వతంత్రంగా పోటీ చేయగా, సిపిఐ తెలంగాణలో తెరాసకు, సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చింది. ఈ రెండు పార్టీలకు కూడా రాష్ట్రవ్యాప్తంగా కచ్చితమైన ఓటు బ్యాంకు, కార్యకర్తల బలం ఉంది. అది అధికారంలోకి రావడానికో, అధికారంలో ఉన్నవారిని సవాల్ చేయడానికే సరిపోయే బలం కాకపోయినా ఫలితాలు తారుమారు చేసేందుకు మాత్రం ఉపయోగపడుతుంది. ఆ తారుమారు చేసే ఓట్లు అటు తెలుగుదేశం పార్టీకి గానీ, ఇటు తెరాసకు గానీ వెళ్లకుండా చూడాలనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆలోచనలో భాగమని చెబుతున్నారు.
కొన్ని స్థానాల్లో, ముఖ్యంగా తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసుకు వామపక్షాల బలం సీట్లను గెలుచుకోవడానికి ఉపయోగపడుతుంది. వామపక్షాల ఓట్లు తమ పార్టీకి కలిస్తే తెరాసను ఎదుర్కోవడం సులభమవుతుందని కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సిపిఐ ఫీజు రీయంబర్స్‌మెంట్ మీద ఏర్పాటు చేసిన సమావేశానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా హాజరైంది.
సిపిఎం ఇటు తెలుగుదేశంతో తెగదెంపులు చేసుకున్న తర్వాత ఒంటరిగానే మిగిలింది. అయితే, సిపిఎం చాలా కాలంగా వైయస్సార్ కాంగ్రెసు వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలోనే సిపిఐకి, సిపిఎంకు మధ్య తేడాలు వచ్చినట్లు ఊహాగానాలు చెలరేగాయి. అయితే, సిపిఐ కార్యదర్శి కె. నారాయణ ఇటీవలి కాలం దాకా వైయస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిపిఐని కూడా తమతో కలిసి తీసుకుని వెళ్లాలనే ఉద్దేశంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉన్నట్లు చెబుతున్నారు.
మొత్తం మీద, భవిష్యత్తులో, అంటే వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో కొత్త పొత్తులు ఏర్పడవచ్చునని అంటున్నారు. సిపిఐ, తెలుగుదేశం, తెరాస మధ్య కూడా అవగాహన కుదురుతుందనే ప్రచారం సాగుతోంది. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సిపిఎం వైయస్సార్ కాంగ్రెసుతో కలిసి నడిచినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications