• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైయస్ విజయమ్మ సోనియాను కలిశారా?

By Pratap
|

YS Vijayamma-Sonia Gandhi
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసినప్పుడు విజయలక్ష్మికి, సోనియాకు మధ్య సమావేశం జరిగిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందంటూ ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక రాసింది. అయితే, ఈ విషయాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఖండిస్తున్నారని కూడా ఆ పత్రిక రాసింది. తమ పార్టీలోకి కార్యకర్తలు రాకుండా చేయడానికి అటువంటి తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారని వారు అంటున్నట్లు ఆ పత్రిక రాసింది. అయితే, ఈ సమావేశం జరిగిందా, లేదా అనే విషయాన్ని తాము సొంతంగా నిర్ధారణ చేసుకోలేకపోయినట్లు కూడా ఆ పత్రిక స్పష్టం చేసింది.

వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రావడానికి అనుసరించాల్సిన వ్యూహంపై, కుదుర్చుకోవాల్సిన పొత్తులపై కసరత్తు చేస్తున్న కాంగ్రెసు అధిష్టానం వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చేరదీయడంపై కూడా దృష్టి పెట్టినట్లు ఆ పత్రిక రాసింది. ప్రధానమైన ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంచనాకు రావడానికి కాంగ్రెసు అధిష్టానం ప్రయత్నిస్తోంది.

వివిధ ఆరోపణలపై వైయస్ జగన్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. జులై 4వ తేదీన వైయస్ విజయమ్మ ఢిల్లీలో ప్రధాని మన్మోహన్ సింగ్‌ను తమ పార్టీ ప్రతినిధులతో పాటు కలిసి సిబిఐ తన కుమారుడిని వేధిస్తోందని ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో సోనియా గాంధీతో ఆమె సమావేశమైనట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో వైయస్ జగన్ కొద్ది కాలంలో కాంగ్రెసు ఛత్రం కిందికి వస్తారని కాంగ్రెసు సీనియర్ నాయకులు కొందరు అంటున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి ఓటేసినంత మాత్రాన కాంగ్రెసుతో కలిసి పని చేస్తామని కాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు. అయితే, వైయస్ జగన్ వెంట నడుస్తూ ఇప్పటికీ కాంగ్రెసులోనే ఉన్న పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి - కాంగ్రెసు అవసరం జగన్‌కు లేదని, కాంగ్రెసుకే జగన్ అవసరం ఉందని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి సబ్బం హరి సయోధ్య కుదర్చడానికి ప్రయత్నాలు సాగిస్తుండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వానికి అనుకూలంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకోవడంలో సబ్బం హరి కీలకమైన పాత్ర పోషించారు.

అయితే, రాష్ట్రస్థాయిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పొత్తుకు సిద్ధపడకపోవచ్చునని అంటున్నారు. ఎన్నికల తర్వాత అవసరమైతే కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎకు మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. గతంలో వివిధ సందర్భాల్లో వైయస్ జగన్ జాతీయ మీడియాతో మాట్లాడిన తీరు కూడా అదే విషయాన్ని తెలియజేస్తోంది.

వైయస్ జగన్‌ను కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విఫలమయ్యారని కాంగ్రెసు అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అదే సమయంలో రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని ముందు పెడితే జగన్‌ను ఎదుర్కోగలరా అనే సందేహం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో కాంగ్రెసు అధిష్టానం వైయస్ జగన్ కోణంలో ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, ఏదైనా ఎన్నికల తర్వాతనే అన్నట్లు వైయస్ జగన్ తీరు ఉందని చెబుతున్నారు.

English summary
According to media reports - YS Vijaya Lakshmi, Jagan's mother, had met Prime Minister Manmohan Singh on July 4, as head of a delegation of YSR Congress leaders, to allege a witch-hunt by the CBI.A senior source in the Congress says a meeting also took place between Vijaya Lakshmi and Congress president Sonia Gandhi but this was strongly denied by YSR Congress leaders, who accused the Congress of spreading rumors to discourage its cadres from joining the regional party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X