సోనియా రెడీ: కెసిఆర్ గొంతెమ్మ కోర్కెలే అడ్డు!?

తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఓ నిర్ణయానికి వచ్చినప్పటికీ తదనంతర పరిణామాలు మాత్రం పార్టీ పెద్దలకు మింగుడు పడలేదట. ముఖ్యంగా తెరాస వ్యవహారశైలి సమస్యగా మారిందట. విలీనం ప్రతిపాదనలపై జరిగిన అంతర్గత చర్చల్లో కెసిఆర్ కాంగ్రెస్‌కు ఆమోదయోగ్యం కాని డిమాండ్లు పెట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పన్నెండేళ్లు ఉద్యమం చేసినందున.. ముఖ్యమంత్రిని తనను చేయాలని, కూతురుకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని, తనయుడికి కీలక ప్రాధాన్యం ఇవ్వాలని, మంత్రివర్గ రూపకల్పనలో స్వేచ్ఛ ఇవ్వాలని, పునర్నిర్మాణంలో తన మాట చెల్లుబాటు కావాలనే డిమాండ్లు కెసిఆర్ కోరినట్లుగా చెబుతున్నారని ప్రముఖ తెలుగు దినపత్రిక రాసింది.
కెసిఆర్ డిమాండ్లకు అంగీకరించడమంటే తమ పార్టీ నిర్మాణం బలంగా ఉన్న ప్రాంతాన్ని ఆయనకు రాసిచ్చేయడమే అనే అభిప్రాయం కాంగ్రెసులో ఏర్పడిందట. దీంతో తెరాసను విస్మరించి తన దారిలో వెళ్లాలని కాంగ్రెసు నిర్ణయించుకుందట. అందుకు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలనూ సిద్ధం చేసిందట. అందుకే వారు కెసిఆర్ పైన ఎదురుదాడికి సిద్ధమవుతున్నారట. మరింత పక్కా ప్రణాళికతో తెరాసపై ఎదురుదాడికి దిగేందుకు ప్రణాళిక సిద్దం చేసుకున్నారట.
అందులో భాగంగానే తెలంగాణ నేతలు తెలంగాణ ఇచ్చినా మేమే తేకున్నా మేమే బాధ్యులమని చెబుతున్నారని అంటున్నారు. కెసిఆర్ మరోమారు తనంతట తాను ముందుకు వస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ తెరాసను ఇక పట్టించుకోదంటున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానంపైన, పార్టీ నేతలపైన దాడి చేస్తే తీవ్రంగా విరుచుకుపడాల్సిందిగా ఇప్పటికే సంకేతాలు వెళ్లాయి. కెసిఆర్‌తో చేతులు కలిపితే అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తుందన్న హెచ్చరికలు కూడా అందాయట.
తాము తీవ్ర స్వరాల్ని వినిపించినంతకాలం తెలంగాణపై అధిష్ఠానం సానుకూలంగా వ్యవహరించదని సంకేతాలు అందడంతో కొంతమంది ఎంపీలు గొంతు తగ్గించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మదిలో తెలంగాణ ఇవ్వాలనే ఉందట. కానీ ఈ నిర్ణయాన్ని ఎలా అమలు చేయాలనే విషయంపై ఆమెకే ఒక స్పష్టత లేదని అంటున్నారు. పార్టీ పరంగా కాంగ్రెసు తెలంగాణకు సానుకూలమే అంటున్నారు. అదే సమయంలో పార్టీ భవిష్యత్తు కూడా ముఖ్యమని ఆలోచిస్తున్నారట. అయితే కెసిఆర్ పదవులు కోరారనే వాదనను తెరాస తీవ్రంగా ఖండిస్తోంది.












Click it and Unblock the Notifications