విగ్రహాల ధ్వంసం: వైయస్ జగన్ టార్గెట్
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో విగ్రహాల విధ్వంసం తీవ్రమైన ఆందోళనకు దారి తీసింది. సీమాంధ్రలో ఆందోళనకారులు మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను లక్ష్యం చేసుకుని ధ్వంసానికి దిగారు. కొన్ని చోట్ల భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విగ్రహాలను కూడా ఆందోళనకారులు వదిలిపెట్టలేదు. దీంతో కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు మొదట ఆత్మరక్షణలో పడ్డారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ దిష్టిబొమ్మలను తగులపెడితే, ఆ చిత్రాలను చెప్పులతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు.
కాంగ్రెసుకు మూలస్తంభాలైన నేతల విగ్రహాలను లక్ష్యం చేసుకోవడంపై కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసును లక్ష్యం చేసుకుని విమర్శలు చేయడం ప్రారంభించారు. సీమాంధ్రలో పెద్ద యెత్తున వెలిసిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు మాత్రం ఏ విధమైన హానీ జరగలేదు. కానీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలు లక్ష్యాలు కావడంతో వైయస్ జగన్‌పై కాంగ్రెసు నాయకులు విమర్శలు ఎక్కు పెట్టారు.

వైయస్ జగన్ పార్టీకి చెందినవారే విగ్రహాల ధ్వంసం చేస్తున్నారని నెల్లూరు జిల్లాకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి విమర్శించారు. విగ్రహాల విధ్వంసాన్ని ఇలాగే కొనసాగిస్తే వైయస్ విగ్రహాలను ధ్వంసం చేస్తామని ఆయన హెచ్చరించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మ బంధువు, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు తన పార్లమెంటు సహచరుల పక్షాన ఓ సుదీర్ఘమైన ప్రకటన వెలువరించారు.
ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ధ్వంసం చేయవద్దని ఆయన ఆందోళనకారులను కోరారు. సీమాంధ్ర ప్రజల ఆందోళనను బలపరుస్తున్నట్లు చెబుతూనే ఆ విజ్ఝప్తి చేశారు. ఆ తర్వాత విగ్రహాల విధ్వంసం కార్యక్రమం తగ్గుముఖం పట్టింది. నిజానికి, రాజీనామాలకు తెర తీసింది కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులే.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైయస్ విజయమ్మ మినహా మిగతా శాసనసభ్యులంతా ముందుకు వచ్చారు. సమైక్యవాదాన్ని భుజాన వేసుకోవడం ద్వారా సీమాంధ్రలో రాజకీయ ప్రయోజనం పొందడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అగ్ర భాగాన నిలిచే పరిస్థితి ఏర్పడింది. దీంతో కాంగ్రెసు శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు రంగంలోకి దిగారు. రాష్ట్ర విభజనపై మౌనంగా ఉంటూ వచ్చిన సీమాంధ్ర తెలుగుదేశం ప్రజాప్రతినిధులు కూడా రాజీనామాలకు దిగారు. మొత్తం మీద, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజీనామాల ద్వారా ప్రయోజనం పొందుతుందని భావించిన కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు రంగం మీదికి వచ్చారు.












Click it and Unblock the Notifications