తెరాస గౌరవాధ్యక్షుడిగా కడియం శ్రీహరి?

పార్టీలో చేరే తెలుగుదేశం పార్టీసీనియర్లకు సముచిత స్థానం లభిస్తుందన్న సానుకూల సంకేతాలిచ్చేందుకు కడియం శ్రీహరిని గౌరవ అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. గతంలో నాగం జనార్దన్‌రెడ్డి తెరాసలో చేరాలని భావించినప్పటికీ, సమకాలికుడి వద్ద సరైన గౌరవం లభించదన్న అనుమానంతోనే ఆయన బిజెపి వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెబుదతున్నారు.
తెలుగుదేశం పార్టీ నుంచి మరికొందరిని తీసుకోవాలని భావిస్తున్న సమయంలో అలాంటి వారికి సముచిత స్థానం లభిస్తుందన్న సంకేతాలివ్వాలంటే, వారికి గౌరవం ఉంటుందని వారిలో నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అదే కడియం శ్రీహరిని పార్టీ గౌరవాధ్యక్షుడిగా నియమిస్తే, తెలుగుదేశం నుంచి వలసలు భారీ స్థాయిలోనే ఉంటాయన్న అంచనా వ్యక్తమవుతోంది. దానితోపాటు దళితులను పార్టీ వైపు రాబట్టవచ్చుననే భావనతోనే కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దానికి తోడు చాలామంది సీనియర్లు కూడా ఈ సలహా ఇచ్చారంటున్నారు.
తొలుత ఈ ప్రతిపాదనపై కెసిఆర్ కొంత విముఖత ప్రదర్శించారని, కొత్తగా వచ్చిన శ్రీహరికి వెంటనే గౌరవ అధ్యక్ష పదవి ఇస్తే,పార్టీలో చాలాకాలం నుంచి పనిచేస్తున్న సీనియర్లు మనస్తాపం చెందే ప్రమాదం ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. పార్టీలో చేరిన చాలామందికి వెంటనే పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించిన విషయాన్ని వారు గుర్తు చేసినట్లు సమాచారం. కడియంకు గౌరవ అధ్యక్ష పదవి ఇస్తే దళితులు దగ్గరవుతారన్న సూచనతో కెసిఆర్ చివరకు ఆ ప్రతిపాదనను ఆమోదించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications