జగన్ టు మోడీ: 'టి' ఎవరి ప్రభావం!?(పిక్చర్స్)
అధికార కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. మంగళవారం మొదట యూపిఏ, ఆ తర్వాత సిడబ్ల్యూసి భేటీ అయి హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణకు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. తెలంగాణ ఉద్యమం దాదాపు ఆరు దశాబ్దాలుగా ఉంది. ఉద్యమాలలో వేయి మందికి పైగా అమరులయ్యారు.
తెలంగాణ కోసం ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, పార్టీలు ఉద్యమించాయి. ఏళ్లపాటు సాగిన ఉద్యమం గత నాలుగేళ్లుగా ఉధృత రూపం దాల్చింది. 2009 డిసెంబర్ 9న కేంద్రం ఇచ్చిన తెలంగాణను వెనక్కి తీసుకోవడంతో ఉద్యమం కొత్త రూపు సంతరించుకుంది. పలు పార్టీలు మద్దతు పలికాయి. తెలంగాణ సాధన కోసం తెలంగాణ ఉద్యోగ, విద్యార్థి, రాజకీయ ఐక్యకార్యాచరణ సమితిలు ఏర్పడ్డాయి. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ ప్రకటనలో అందరి పాత్ర ఉంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుల మౌనమే విభజనకు కారణమని కొందరు, కెసిఆర్ సాధ్యం చేశారని కొందరు, తమ పార్టీ నేత, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి భయపడి కేంద్రం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసిందని బిజెపి చెబుతోంది. వాటిల్లో కూడా నిజం ఉందని చెప్పవచ్చు.

తెలంగాణ ఉద్యమం
తెలంగాణ ఉద్యమం యాబై ఏడేళ్లుగా ఉంది. తెలంగాణ రాష్ట్రం కోసం వేలాది మంది ప్రాణత్యాగం చేశారు. అరవయ్యేళ్ల తెలంగాణ ప్రజల కలను కాంగ్రెసు పార్టీ తన ప్రకటన ద్వారా నిజం చేసేందుకు సిద్ధమైంది. త్వరితగతిన బిల్లును తెలంగాణ బిల్లును పాస్ చేయించాలని చూస్తోంది.

ఐకాస
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు దీక్ష అనంతరం కాంగ్రెసు తెలంగాణపై ప్రకటన చేసి, ఆ తర్వాత వెనక్కి పోయింది. అనంతరం ఉద్యమం ఉదృతమైంది. తెలంగాణ కోసం తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ఏర్పాటయింది. ఇందులో తెలంగాణవాద పార్టీలు చేరాయి. ఐకాస నేతృత్వంలో పలు కార్యక్రమాలు చేపట్టారు.

వైయస్ జగన్
కాంగ్రెసు పార్టీ తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఓ కారణమని చెప్పవచ్చు. ఆయన సొంత కుంపటి పెట్టుకున్న తర్వాత సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా సీమాంధ్రలో జగన్ ఎక్కువ లోకసభ స్థానాలు గెలిచే స్థితిలో ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. ఓ వైపు జగన్, మరోవైపు తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో అధికార కాంగ్రెసు తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా ఒక ప్రాంతంలో క్లీన్ స్వీప్, మరో ప్రాంతంలో కొన్ని సీట్లనైనా గెలుచుకోవచ్చునని భావించింది.

చంద్రబాబు నాయుడు
తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వైయస్ జగన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుల మౌనమే కారణమని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, మంత్రి టిజి వెంకటేష్ వంటి నేతలు చెబుతున్నారు. నాలుగేళ్ల క్రితం పార్టీలకతీతంగా సీమాంధ్ర నేతలు రాజీనామా చేయడం వల్ల తెలంగాణపై కేంద్రం వెనక్కి తగ్గిందని, ఇప్పుడు బాబు కలిసి రాకపోవడం సమైక్యాంధ్రకు శాపమైందని విమర్శిస్తున్నారు.

నరేంద్ర మోడీ
కాంగ్రెసు పార్టీ హడావుడిగా తెలంగాణపై ఓ నిర్ణయం ప్రకటించడం వెనుక రాజకీయ కారణాలున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వైపు ఆకర్షితులవుతున్నారు. ఆగస్టు 11న మోడీ హైదరాబాద్ రానున్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీని నిలదీసేందుకు బిజెపి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మోడీ మానియాను నిలబడకుండా చేసి, వచ్చే ఎన్నికల్లో తామే ఎక్కువ స్థానాలు గెలిచే ఉద్దేశ్యంలో భాగంగానే కాంగ్రెసు తెలంగాణపై ప్రకటన చేసిందని అభిప్రాయపడుతున్నారు. కిషన్ రెడ్డి మంగళవారం మాట్లాడుతూ.. మోడీ భయంతోనే కాంగ్రెసు తెలంగాణపై హడావుడి ప్రకటన చేసిందని చెప్పారు.

విద్యార్థులు, ఉద్యోగులు....
తెలంగాణపై కాంగ్రెసు ప్రకటన విషయంలో రాజకీయ నాయకుల పాత్ర ఎవరిది ఎంతున్నా.. ప్రధానంగా ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు మమేకం ఎంత మాత్రం మరువలేనిది. వారి వల్లనే ఉద్యమం తీవ్రరూపం దాల్చి కాంగ్రెసు పార్టీ తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం వెలువర్చి.. రాష్ట్రం ఇచ్చే దిశగా ఆలోచిస్తుందని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications