సాక్షి మీడియా లీక్: జగన్ పార్టీలో 'సమన్వయ' గోల

త్వరలో స్థానిక సంస్థలకూ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కేడర్‌ను కాపాడుకుని, వారిలో ఉత్సాహం నింపేందుకు కొత్త ఎత్తుగడలను ప్రారంభించినట్లు చెబుతున్నారు. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆదేశం మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ సమన్వయకర్తలను నియమిస్తున్నారు. వారి ద్వారా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పటిష్ఠత కోసం చర్యలు చేపట్టాలని చూస్తున్నారు. ఈ సమన్వయకర్తలే వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులవుతారని చెబుతున్నారు. దీంతో ఆ నాయకులు చురుగ్గా పనిచేయడం మాట అటుంచి, టికెట్లు ఆశిస్తున ఇతర నాయకుల్లో తీవ్ర ఆసంతృప్తి చోటు చేసుకుంది.
సమన్వకర్తల జాబితాను గురువారంనాడు విడుదల చేయాల్సి ఉంది. కానీ అది జరగలేదు. నియోజకవర్గాలవారీగా జాబితాలు రూపొందించి ఆయన జిల్లాలకు పంపించినట్లు శుక్రవారం మీడియాలో వార్తలు వచ్చాయి. జిల్లాలో కూడా జాబితాను బహిర్గతం చేయకుండా జగన్ సొంత మీడియా ద్వారా 'లీక్' చేయించారు. వచ్చినవారిని వచ్చినట్లు పార్టీలోకి తీసుకోవడంతో చాలా నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో సమన్వయకర్త ప్రతి నియోజకవర్గంలో ముందుకు రావడంతో మిగతా నాయకుల్లో అసంతృప్తి చోటు చేసుకుంది. దీంతో జగన్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరింతగా పెరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
ఇప్పటికే వందకుపైగా నియోజకవర్గాలకు సమన్వయకర్తల పేర్లను ఖరారు చేసిన జగన్, కొన్నింటిని పెండింగ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. 120 నియోజకవర్గాల్లో సమస్య లేదని, మిగతా నియోజకవర్గాల్లో మాత్రం సమస్య ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. సమన్వయకర్తల ఖరారు తర్వాత పార్టీలో ఉండేవాళ్లు ఉంటారు, పోయేవాళ్లు పోతారని కూడా అంటున్నారు. దీని వల్ల పార్టీకి మేలే జరుగుతుంది తప్ప హాని జరగదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ధీమాతో ఉన్నారు.
సమన్వయకర్తల పేర్లను పార్టీ కాకుండా సాక్షి మీడియా ద్వారా వ్యూహాత్మకంగానే లీక్ చేశారని అంటున్నారు. పార్టీలో ఎవరు ఉంటారు, ఎవరు పోతారనే స్పష్టత కూడా ఇప్పుడే రావడం వల్ల తమకు మేలు జరుగుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications