నోరు చేసుకున్నవాళ్లే ఇప్పుడు జగన్‌కు చేరువ

దాడి వీరభద్రరావు వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వైయస్ కుటుంబంపై తీవ్రమైన ఆరోపణల దాడి సాగించారు. దాన్ని చూపించి దాడి వీరభద్రరావును వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేర్చుకోవడాన్ని కొణతాల రామకృష్ణ వ్యతిరేకిస్తున్నారు. దాడి వీరభద్రరావుతో తాను 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నానని, ఈ స్థితిలో దాడి వీరభద్రరావుతో కలిసి పనిచేయడం సాధ్యం కాదని ఆయన చెబుతున్నారు. తాను తెలుగుదేశం పార్టీ వైఖరిని మాత్రమే చెప్పానని, అవి తన సొంత అభిప్రాయాలు కావని దాడి వీరభద్రరావు వైయస్‌పై, ఆయన కుటుంబంపై చేసిన ఆరోపణల నుంచి తప్పుకోవడానికి చూస్తున్నారు.
ఇక గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ అవినీతిపై, జగన్ అక్రమ సంపాదనపై తెలుగుదేశం పార్టీ వేసిన రాజా ఆఫ్ కరప్షన్ అనే పుస్తకంలో చోటుచేసుకున్న అంశాలన్నీ మైసూరారెడ్డి, దాడి వీరభద్రరావు స్వయంగా సమీక్షించారు. వైయస్ రాజశేఖర రెడ్డి బ్రతికున్నంత కాలం ఆయనతో మైసురా రెడ్డి వైరాన్ని కొనసాగించారు. ఇప్పుడు ఆయన కుమారుడు స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.
తెలుగుమహిళా అధ్యక్షురాలిగా కొనసాగిన రోజా, వైయస్ కుటుంబంపై నిత్యం అవినీతి ఆరోపణలు చేస్తూ, విమర్శనాస్త్రాలు సంధించేవారు. అయితే ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరగానే వైయస్ కుటుంబాన్ని ఆకాశానికెత్తుతున్నారు. శాసనసభ్యులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కొడాలి నాని, అమర్‌నాథ్‌రెడ్డి, వనిత, సాయిరాజ్ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు - లఇలా ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డిపై, ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు చేసినవారే.
ఏమైనా రాజకీయాల్లో సిద్దాంతాలు, వైఖరులు పక్కకు పోయినట్లే కనిపిస్తున్నాయి. ఒక విధానానికి, సిద్ధాంతానికి కట్టుబడకపోవడం వల్లనే ఈ పరిణామాలు సంభవిస్తున్నాయని అంటున్నారు. పార్టీలు కూడా స్పష్టమైన సిద్ధాంతాల జోలికి వెళ్లడం లేదు. విధానాలను పార్టీ అగ్రనేతలు తమకు అనువుగా మలుచుకుంటున్నారు.












Click it and Unblock the Notifications