తెలంగాణ: మాటపై సోనియా ఆవేదన, రాహుల్ నో

సమాచారం మేరకు సీనియర్ కేంద్ర కేబినెట్ మంత్రులతో సోనియా గాంధీ తెలంగాణ అంశంపై స్పందించారట. తాను తెలంగాణపై గతంలో హామీ ఇచ్చానని, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే తాను దానిపై హామీ ఇచ్చానని, ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవాల్సి ఉందని ఆమె మంత్రులతో చెప్పారట.
వైయస్ ఉన్నప్పుడే హామీ ఇచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది ఇవ్వలేకపోయామని, తెలంగాణను ఇవ్వాల్సి ఉందని, తన మాటను తాను ఎలా తప్పగలనని సోనియా వారితో అన్నారట. తాను తెలంగాణకు అనుకూలంగానే ఉన్నానని ఆమె చెప్పారట. అయితే తెలంగాణ విషయంలో సోనియాతో రాహుల్ గాంధీ మాత్రం విభేదిస్తున్నారని అంటున్నారు.
సోనియా మాటలకు సదరు మంత్రులు మీ నిర్ణయం మీరు తీసుకోవాలని చెప్పారట. తెలంగాణ విషయంలో ఎలాంటి చర్చలు అవసరం లేదని, కాంగ్రెసు పార్టీలో కూడా ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో మీరే ఓ కచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని ఆమెను మంత్రులు కోరినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌గా వచ్చిన దిగ్విజయ్ సింగ్ ప్రస్తుతం తెలంగాణకు అనుకూలంగా ఉన్నారని అంటున్నారు. ఆయన గతంలో తెలంగాణకు వ్యతిరేకిగా ముద్రపడ్డారు. అయితే ఇటీవల తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నట్లు గమనించిన ఆయనలో ఈ విషయంలో మార్పు వచ్చి ఉంటుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications