వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్రమత్తమైన నేతలు: సీమాంధ్రకు 'భారీ' వరాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

కాంగ్రెసు పార్టీ, కేంద్రం విభజనపై వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో సీమాంధ్రలోని ఆగ్రహజ్వాలలు చల్లార్చేందుకు భారీ ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది! దీనికి సంబంధించి ఆయా మంత్రిత్వ శాఖలు కీలక ప్రతిపాదనలతో ముందుకు వస్తున్నాయంట. రాష్ట్రానికే చెందిన పళ్లం రాజు మంత్రిగా ఉన్న మానవ వనరుల అభివృద్ధి శాఖ సీమాంధ్రలో ఉన్నతస్థాయి జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుకు ముందుకొచ్చింది.

పెట్రోలియం శాఖ, జలవనరుల మంత్రిత్వ శాఖలు కూడా విభజనపై కేంద్రానికి నివేదికలు అందించాయి. విభజనపై అభిప్రాయాలు, సూచనలు పంపేందుకు కేంద్ర హోంశాఖ ఇచ్చిన గడువు మంగళవారంతో ముగిసింది. అయినప్పటికీ ఎవరికి వారుగా, వేర్వేరుగా నివేదికలను రూపొందిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మంగళవారం అనూహ్యంగా మళ్లీ రాయల తెలంగాణ, హైదరాబాద్ యూటి డిమాండ్‌లు తెరపైకి వచ్చాయి.

అధిష్టానం ముందు సమైక్య గళం వినిపిస్తున్న సీమాంధ్ర నేతలు విభజన తథ్యమైన నేపథ్యంలో మరోవైపు భారీ ప్యాకేజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు 'భారీ' నివేదిక ఇచ్చారు. కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజలు అంగీకరిస్తే రాయల తెలంగాణనూ పరిశీలించవచ్చునని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిలో సీమాంద్రుల పాత్ర, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కూడా కోరినట్లుగా తెలుస్తోంది.

అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు కూడా రాయల టి ప్రస్తావన తెచ్చారు. మజ్లిస్ పార్టీ కేంద్ర హోంశాఖకు పంపిన నివేదికలో రాయల తెలంగాణతో అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపింది. హైదరాబాద్‌ను యూటిగా ప్రకటించవద్దని తేల్చి చెప్పింది. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలంగాణ, సీమాంధ్ర నేతల అభిప్రాయాలతో వేర్వేరు నివేదికలు పంపించారు.

సీమాంధ్రకు ఐఐటి, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, కేంద్రీయ విశ్వవిద్యాలయాలను మానవ వనరుల శాఖ ప్రతిపాదించింది. పెట్రోలియం, జల వనరులు తదితర శాఖలూ తమ తమ ప్రతిపాదనలను అందించాట. కేంద్ర మంత్రుల బృందానికి సమర్పిస్తున్న నివేదికల్లో వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు పలు ప్రతిపాదనలు చేస్తున్నాయి. సీమాంధ్ర ప్యాకేజీలో భాగంగా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

విభజన సందర్భంగా సీమాంధ్ర ప్రాంతానికి పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇచ్చి, వెల్లువెత్తిన ప్రజాందోళనను తగ్గించాలని చూస్తోంది. ఈ నెల ఏడో తేదీన జివోఎం మలి సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో, ఇప్పటికే కేంద్ర మానవ వనరులు, జల వనరులు, పెట్రోలియం, సహజవాయువు శాఖలు తమ తమ నివేదికలను సమర్పించాయి. మిగతా శాఖలు కూడా బుధ, గురువారాల్లో నివేదికల్ని సమర్పించే అవకాశముంది.

Home Affairs

విద్య, వైద్యం, ఆరోగ్య రంగాలకు సంబంధించిన ప్రతిష్ఠాత్మక సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమయ్యాయని, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా హైదరాబాద్‌కే పరిమితమయ్యాయని, రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా పలువురు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రతిష్ఠాత్మక విద్య, పరిశోధనా సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్న నేపథ్యంలో తాము తీవ్రంగా నష్టపోతామని సీమాంధ్ర విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.

ఇవే అంశాలను పేర్కొంటూ ప్రజలు, వివిధ వర్గాలు, సంస్థలు, రాజకీయ పార్టీలు జివోఎంకు నివేదికలు, ప్రతిపాదనలు, సూచనలను అందించాయి. జివోఎం వాటిని వివిధ మంత్రిత్వ శాఖలకు పంపించింది. వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న వివిధ మంత్రిత్వ శాఖలు ఈ నివేదికలను తయారు చేశాయి. ఈ నేపథ్యంలోనే, సీమాంధ్రలో ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ, ఐఐఎంలతోపాటు మూడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమేనని మానవ వనరుల శాఖ తన నివేదికలో పేర్కొంది.

విభజన జరిగితే సీమాంధ్ర విద్యార్థులు పెద్దఎత్తున నష్టపోతారంటూ వస్తున్న భయాలు, అనుమానాల నేపథ్యంలో వాటిని నివృత్తి చేయడమే కాకుండా సీమాంధ్రకు వీలైనంత ఎక్కువ ప్రయోజనం చేకూర్చేందుకు, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతిష్ఠాత్మక పరిశోధన, విద్యా సంస్థలకు దీటుగా సీమాంధ్రలో కూడా ఆయా సంస్థల్ని ఏర్పాటు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మానవ వనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ సంస్థల ఏర్పాటుకు దాదాపు రూ.7 వేల కోట్లు ఖర్చవుతాయని ఆ శాఖ అంచనా వేసింది.

English summary
In a bid to soothe Seemandhra, the Congress on Telangana will soon start deliberations of a special package for its development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X