ఏపీకి ప్యాకేజీ: చంద్రబాబుతో కటీఫ్, లాభనష్టాలపై విశ్లేషించిన బీజేపీ!
అమరావతి: ఏపీకి హోదా ఇవ్వలేమని, హోదాకు మంచి ప్రత్యేక ఆర్ధిక సాయాన్ని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో విపక్షాలు రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఏపీకి హోదా ఇవ్వకుండా బీజేపీ తప్పు చేస్తోందని టీడీపీ ప్రజల ముందు ఓ పథకం ప్రకారం తమను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర బీజేపీ నేతలు అనుమానాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
విభజన సమయంలో వెంకయ్య నాయుడు ఏపీకి ప్రత్యేకహోదా కోసం పట్టుబడినప్పటికీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక హోదా విషయంలో చేతులెత్తేసిన వైనాన్ని టీడీపీ ప్రజలకు చెప్పకనే చెబుతున్నాయి. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం వెంకయ్య తీరుని కాకినాడ సభలో తప్పుబట్టారు.

ఈ క్రమంలో హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్ర పెద్దలు ప్యాకేజీ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏపీలో మూడు బహిరంగ సభలు నిర్వహించి ప్యాకేజీ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ప్రకటించారు.
2019లో జరగనున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే ఓ ప్రణాళిక ప్రకారం సమాయత్తం కావాలని ప్యాకేజీ విషయంలో కేంద్రాన్ని విమర్శిస్తున్న టీడీపీతో ఎన్నికలకు ముందే బీజేపీయే తెగతెంపులు చేసుకుంటే సంస్థాగతంగా ఎదగవచ్చని పలువురు బీజేపీ నేతలు అధిష్ఠానం ప్రతినిధుల ముందు వ్యాఖ్యానించినట్టు సమాచారం.
బీజేపీ జిల్లా కార్యదర్శలు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌ఛార్జిలతో గత వారంలో కేంద్రం నుంచి వచ్చిన అరుణ్ సింగ్, సిద్ధార్థ నాథ్ సింగ్‌లు సమావేశమైన వేళ, బీజేపీయే ముందుగా స్పందించి తెలుగుదేశంతో విడిపోతే వచ్చే లాభనష్టాలపై రాష్ట్ర నేత కందుల రాజమోహన్ రెడ్డి చేసిన ప్రసంగం, రాజకీయ విశ్లేషణ అందరినీ ఆకర్షించిందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కందుల రాజమోహన్ రెడ్డి చేసిన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో మరో పదేళ్ల వరకూ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, మరోవైపు ప్రజా విశ్వాసాన్ని చూరగొనడంలో వైసీపీ విఫలమవుతోందని చెబుతూ, కొత్తగా ఓటు హక్కు వచ్చే యువతకు బీజేపీ దగ్గర కావచ్చని ఆయన పేర్కొన్నారట.
రాజకీయాలలో సానుభూతి అంశం ఒక్కసారే పనిచేస్తుందని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఉన్న సానుభూతి 2014 ఎన్నికలలో పని చేసినప్పటికీ... జగన్‌పై ఉన్న అవినీతి ఆరోపణలతో అది నిలబడలేకపోయిందని చెప్పారట. ఇక అధికారంలో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు కష్టపడుతున్నప్పటికీ రాయలసీమలో ఆయనపై వ్యతిరేకత పెరిగిందని, ఉత్తరాంధ్ర వాసులు తమను పట్టించుకోవడం లేదని భావిస్తున్నారని గుర్తు చేస్తూ, టీడీపీతో తెగతెంపులు చేసుకుంటే బాగుంటుందని బీజేపీ నేతల దృష్టికి తీసుకెళ్లారు.
రాయలసీమ, ఉత్తరాంధ్రలో ప్రజలు నిర్లిప్త భావనలో ఉన్నారనీ, ఈ సమయంలో వారికి మనోధైర్యం కల్పించి బీజేపీ దగ్గరైతే బాగుంటుందని సూచించారు. విశ్లేషణ వరకు బాగానే ఉన్నప్పటికీ ఆచరణలో ఎంతవరకు సాధ్యం అన్నది తెలియక పలువురు తలలు పట్టుకున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబుకన్నా ముందే బీజేపీ స్పందించి ఆయనతో తెగతెంపులు చేసుకోవాలని సూచించగా, ఇదే సమయంలో బీజేపీ అగ్రనేత ఒకరు కల్పించుకుని రాజమోహన్ రెడ్డి విశ్లేషణ బాగున్నప్పటికీ ఇలాంటి అంశాలు బయటకు వెళితే బాగోదని సూచించారట.
ఇప్పటికే ఎన్టీయేలో ఉన్న మిత్రపక్షాలలో శివసేనతో అంతంతమాత్రంగానే సంబంధాలు ఉన్నాయని చెప్పిన పార్టీ అధిష్టానం, పంజాబ్‌లో అకాలీదళ్ ప్రజాదరణ కోల్పోయిందని అంటూ ప్రస్తుతం మనకు ఉన్న నమ్మకమైన మిత్రుడు చంద్రబాబేనని, సమయం వచ్చినప్పుడు ఆలోచిద్దామని చెప్పినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications