జయ వారసత్వం కోసం ఆరాటం: ఎవరీ దీపా జయకుమార్?
చెన్నై: అనారోగ్యం కారణంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జయలలిత వారసురాలు ఎవరు? అనే అంశంపై తమిళనాట తీవ్రంగా చర్చసాగుతోంది. ఇదే సమయంలో జయలలిత రాజకీయ వారసురాలిని తానేనంటూ తెరపైకి వచ్చారు ఆమె అన్న కుమార్తె దీపా.
సీఎం జయలలిత స్వయానా సోదరుడైన జయకుమార్, విజయలక్ష్మిని వివాహం చేసుకుని జయలలితతోపాటు పోయెస్‌గార్డెన్‌లో ఉండేవారు. దీపా ఆ ఇంట్లోనే పుట్టింది. ఆ తర్వాత అన్నాచెల్లెళ్ల మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో ఆయన పోయెస్ గార్డెన్ వదిలి చెన్నైలోని టీనగర్‌లో కాపురం పెట్టారు.

ఈ క్రమంలో 1995లో జయకుమార్ మృతి చెందగా జయలలిత ఇంటికి వెళ్లి మరీ పరామర్శించి వచ్చారు. అయితే 2013లో వదిన చనిపోయినపుడు మాత్రం జయలలిత వెళ్లలేదు. అంతేకాదు ఇటీవలే జరిగిన మేనకోడలు దీపా వివాహానికీ హాజరు కాలేదు. దీంతో వధూవరులే జయలలిత ఇంటికి వెళ్లి ఆశీర్వాదం పొందారు.
దీంతో వధూవరులకు అత్త హోదాలో జయలలిత ఒక ఫ్లాట్‌ను కానుకగా ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీపా వైవాహిక జీవితం కొన్నాళ్ల పాటు సజావుగా సాగినా ఆ తర్వాత భర్తతో విభేదాలు చోటుచేసుకున్నాయి. దీంతో భర్తకు దూరమై, తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా మిగిలిన దీప అత్త జయలలితకు చేరువకావాలని ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇటీవలే జయలలిత ఇంటి వద్ద గంటసేపు నిరీక్షించినా జయ అందుకు అంగీకరించలేదు. 'పోయెస్‌గార్డెన్‌లోని ఈ ఇల్లు మా నానమ్మ (జయలిత తల్లి సంధ్య) నాకు రాసిచ్చింది. దస్తావేజులు కూడా ఉన్నాయి. మా ఇంట్లోకి వెళ్లనీయకుండా అడ్డుకునేందుకు మీరు ఎవరు?' అంటూ ఈ సందర్భంగా సెక్యూరిటీ అధికారులతో ఘర్షణ పడ్డారు.

మా నాన్న కుటుంబీకులు అత్తకు దగ్గర కావడం పోయెస్ గార్డెన్‌లోని కొందరికి ఇష్టం లేకపోవడం వల్లే ఇలా జరిగిందంటూ దీపా శశికళను ఉద్దేశించి పరుష వ్యాఖ్యలు కూడా చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత జయలలితను కలిసేందుకు ఆగస్టులో మరోసారి కలిసేందుకు ప్రయత్నించారు.
జయలలితే స్వయంగా తనను రాజకీయ వారసురాలిగా ప్రకటించాలని ఆశిస్తూ దీపా తన ప్రయత్నాలు కొనసాగించారు. దీనిని గమనించిన వారి కుటుంబ మిత్రుడు, బీజేపీ సీనియర్ నేత దీపాను సున్నితంగా వారించినట్లు సమాచారం. జయ వారసత్వం కోసం ఓపిక పట్టాల్సిందిగా నచ్చజెప్పే ప్రయత్నం చేశారని తెలిసింది.
లండన్‌లో ఉన్నత విద్యనభ్యసించిన దీపాకు ఆయనే అమెరికాలో ఒక ఉద్యోగం చూసి పెట్టారు. ఇంతలో జయలలిత అనారోగ్యానికి గురై అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ సమయంలో అత్తను కలిసేందుకు దీపా తీవ్రంగా ప్రయత్నించారు. ఆసుపత్రిలో తన అత్తను చూసేందుకు అవకాశం కల్పించాలన్న విజ్ఞప్తులను అన్నాడీఎంకే నేతలు పట్టించుకోకుండా తిరిగి పంపించి వేశారు.












Click it and Unblock the Notifications